థియేటర్..ఏం బావుకోవాలి?

థియేటర్..థియేటర్..అన్న హడావుడి మళ్లీ మొదలైంది. పెద్ద సినిమాలు అన్నీ జాగ్రత్తగా వెనక్కు వుండి చిన్న సినిమాలను బరిలోకి దింపుతున్నాయి. వాటికి వస్తున్న కలెక్షన్లు చూసి, అంతా సెట్ అయిపోయింది. పదండి అంటూ మీడియం సినిమాలను…

థియేటర్..థియేటర్..అన్న హడావుడి మళ్లీ మొదలైంది. పెద్ద సినిమాలు అన్నీ జాగ్రత్తగా వెనక్కు వుండి చిన్న సినిమాలను బరిలోకి దింపుతున్నాయి. వాటికి వస్తున్న కలెక్షన్లు చూసి, అంతా సెట్ అయిపోయింది. పదండి అంటూ మీడియం సినిమాలను ముందుకు తోస్తున్నాయి. అంతే తప్ప లవ్ స్టోరీ లాంటి పెద్ద సినిమా మాత్రం బరిలోకి దిగడం లేదు.  సీటీమార్ లాంటి సినిమా వుంది. ఓటిటికి వెళ్లవద్దు, థియేటర్ లోకి రమ్మంటే, ఇప్పటి పరిస్థితుల్లో కిట్టుబాటు అయ్యే వ్యవహారమేనా?

దాని నిర్మాత ఆసియన్ సునీల్ మాత్రం మిగిలిన వారందరినీ ఓటిటికి వెళ్ల వద్దని కట్టడి చేస్తున్నారు. ఆయన మాత్రం సినిమాను అలా పక్కన పెట్టుకున్నారు. ఆయనకు ఆర్థిక స్థోమత వుంది. సినిమాను ఎన్నాళ్లయినా పక్కన పెట్టి వుంచగలరు. మిగిలిన వారు అందరూ అలా చేయాలని ఎలా శాసిస్తారు? 'పోనీ థియేటర్ల అసోసియేషన్ సినిమాను కొనేసి, వేసుకోవచ్చు కదా…ఓటిటికి ఇవ్వకుండా' అని ఓ నిర్మాత ప్రశ్నించారు. అంటే ఆవేదన అర్థం చేసుకోవాలి. 

ఇప్పటికి గత రెండు వారాలుగా డజను సినిమాలు వస్తే ఎస్ ఆర్ కళ్యాణమండపం ఒక్కటే ఓకె అనిపించుకోగలిగింది. అది కూడా కేవలం మొదటి మూడు రోజులే. సినిమా టోటల్ అమ్మకాలు అన్నీ ఎక్కువ లెక్క వేసుకున్నా నాలుగు కోట్లు దాటవు. 65 లక్షలకు వైజాగ్ అమ్మితే మూడు రోజులకు 38 లక్షలు షేర్ వచ్చింది.  అంటే సగటు రోజుకు 13 లక్షలు వచ్చినట్లు. ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ కావచ్చు.  

అదే సినిమా నైజాంలో ఫస్ట్ వీకెండ్ లో కోటి పది లక్షలకు పైగా తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ అయింది. కానీ మళ్లీ మండే నుంచి తగ్గింది. మొత్తం మీద ఇక్కడ కాస్త లాభాలు కళ్ల చూడవచ్చు. అంటే మూడు నాలుగు కోట్ల చిన్న సినిమా పరిస్థితే ఇలా వుంటే పాతిక కోట్ల టక్ జగదీష్ వేసి ఏం సాధించాలి? పోనీ ఎస్సార్ కళ్యాణమండపం మాదిరిగా ఊపు, టాకు తెచ్చుకుంది అనుకుందాం. మిడ్ రేంజ్ సినిమా కాబట్టి దీనికి డబుల్ లాగేస్తుంది అనుకుందాం. అప్పుడు కూడా తొలివారం అంతా కలిపి పది కోట్ల మేరకు లాగితే ఆ తరువాత పరిస్థితి ఏమిటి?

మరి ఏం చూసుకుని టక్ జగదీష్ మళ్లీ థియేటర్ అని ఊగుతోంది? చిన్న సినిమాలు అన్నీ ఆగస్టు, సెప్టెంబర్ లో దులిపేస్తే అంత వరకు థియేటర్లను అలా నడిపిస్తే, అప్పుడు తామున్నాం అంటూ పెద్ద సినిమాలు వస్తాయి. అంతే కానీ ముందుగా పెద్ద సినిమాలు ధైర్యం చేయవు. అందరూ సంక్రాంతి అంటూ పెట్టుకుని కూర్చుంటారు. ఈ లోగా ఎవరైనా ఓటిటికి వెళ్తాం అంటే హడావుడి స్టార్ట్ చేస్తారు.

టికెట్ రేట్లు మారతాయి ఫలానా టైమ్ కు అని ఎవ్వరూ పక్కాగా బల్ల గుద్ది చెప్పలేకపోతున్నారు. మరి పాతిక కోట్ల సినిమాను అలా అక్టోబర్ వరకు వుంచాలంటే అయ్యే వడ్డీని ఎవరు భరిస్తారు?  కేవలం థియేటర్ వ్యవస్థను బతికించడం కోసం సినిమాలను బలిపెట్టడం ఎంత వరకు సబబు అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అన్నీ బాగుంటే ఏ నిర్మాత ఓటిటికి వెళ్లడు. అన్నీ బాగుండే వరకు ఓటిటికి వెళ్ల వద్దు అనే డిమాండ్ సరికాదు అని నిర్మాతలు అంటున్నారు.