కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి మెగాబ్రదర్ నాగబాబు ఝలక్ ఇచ్చారు. అందులోనూ బీజేపీతో తన పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్రపతి ఎంపికపై నాగబాబు ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు ట్వీట్ బీజేపీని ఇబ్బంది పెట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం అందరికీ తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మెగాబ్రదర్ మద్దతు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బీజేపీని ప్రకాశ్‌రాజ్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తారు. ఇటీవల పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాను ట్విట్టర్ వేదికగా ప్రకాశ్‌రాజ్ విమర్శించారు. ప్రకాశ్‌రాజ్‌కు తమ్ముడి తరపున నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా చిన్న సైజు వార్ నడించింది. అయితే వాటన్నింటిని మరిచిపోయి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నాగబాబు మద్దతు ప్రకటించడం వెనుక ఆయన దూరదృష్టి కనిపిస్తుంది. రాజకీయాల కంటే సమాజ శ్రేయస్సుకే నాగబాబు ప్రాధాన్యం ఇస్తారని జనసైనికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మరో ఏడాదిలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు చేసిన ప్రతిపాదన ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ట్వీట్ ఏంటో చూద్దాం.
‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. రోజు రోజుకూ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్‌టాటా గారు’ అని నాగబాబు ట్వీట్‌చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారాయన.
ఈ ట్వీట్లో …ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పడం ద్వారా బీజేపీని ఇరకాటంలో పడేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దేశాన్ని గత ఏడేళ్లుగా పాలిస్తున్నది మోడీ సర్కారే. మోడీ పాలన బాగలేదనే సంకేతాలను నాగబాబు ట్వీట్ పంపిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే రోజురోజుకూ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటే… అది మోడీ అధ్వాన పాలనకు నిదర్శనమని నాగబాబు ట్వీట్ చెప్పకనే చెప్పిందంటున్నారు.