దేవుడి లాంటి వివేకాను మా కొడుకు హ‌త్య చేయ‌డ‌మా?

దేవుడు లాంటి వైఎస్ వివేకానంద‌రెడ్డిని త‌న కొడుకు ఎందుకు హ‌త్య చేస్తాడ‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌, హ‌త్య కేసులో అనుమానితుడైన సునీల్ యాద‌వ్ తండ్రి కృష్ణ‌య్య ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించాడు. వివేకా హ‌త్య కేసులో తొలి అరెస్ట్…

దేవుడు లాంటి వైఎస్ వివేకానంద‌రెడ్డిని త‌న కొడుకు ఎందుకు హ‌త్య చేస్తాడ‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌, హ‌త్య కేసులో అనుమానితుడైన సునీల్ యాద‌వ్ తండ్రి కృష్ణ‌య్య ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించాడు. వివేకా హ‌త్య కేసులో తొలి అరెస్ట్ సునీల్ యాద‌వ్ కావ‌డం తెలిసిందే. సునీల్ యాద‌వ్ క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉండ‌డంతో సీబీఐ అత‌నిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. గ‌తంలో ఢిల్లీకి పిలిపించి అత‌న్ని విచారించింది.

ప‌దేప‌దే విచార‌ణ‌కు పిలుస్తుండ‌డం, ఇటీవ‌ల వాచ్‌మ‌న్ రంగ‌య్య మీడియాతో మాట్లాడుతూ ఎర్ర‌గంగిరెడ్డితో పాటు సునీల్ యాద‌వ్ పేరును ప్ర‌ముఖంగా చెప్ప‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ నేప‌థ్యంలో సునీల్ యాద‌వ్ అదృశ్య‌మ‌య్యాడు. గోవాలో ఉన్న‌ట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అక్క‌డ అరెస్ట్ చేసుకుని క‌డ‌ప‌కు తీసుకొచ్చారు. 

కోర్టు ప‌ది రోజుల క‌స్ట‌డీకి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో సునీల్ యాద‌వ్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు పులివెందుల‌లో మూడురోజులుగా మార‌ణాయుధాల కోసం వెతుకుతున్నారు. పులివెందుల ప‌ట్ట‌ణంలోని రోటరీపురం, గుర్రాలగడ్డ వంకలో ఆయుధాల కోసం అధికారులు గాలిస్తున్నా ప్ర‌యోజ‌నం లేదు. రేపు కూడా గాలింపు కొనసాగుతుందని సీబీఐ అధికారులు వెల్లడించారు.

వివేకా హ‌త్య‌పై సునీల్ పాత్ర గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సునీల్ తండ్రి స్పందిస్తూ….వివేకానంద‌రెడ్డి త‌మ‌కు దేవుడిలాంటి వార‌ని చెప్పుకొచ్చాడు. వివేకాతో త‌న కుమారుడు స‌న్నిహితంగా మెలిగిన మాట వాస్త‌వ‌మే అన్నాడు.

వివేకానందరెడ్డి త‌మ‌ ఇంటికి రెండు సార్లు వచ్చి వెళ్లాడ‌న్నారు. అలాంటి మంచి వ్యక్తిని త‌న కుమారుడు హత్య చేశాడనడం అవాస్తవమ‌ని స్ప‌ష్టం చేశాడు. వాచ్‌మ‌న్ రంగయ్య చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని కృష్ణ‌య్య తెలిపాడు. రెండున్నరేళ్లుగా నోరు విప్పని రంగయ్య ఈ రోజే ఎందుకు చెప్పాడ‌ని కృష్ణయ్య ప్రశ్నించడం గ‌మ‌నార్హం. 

రెండు నెల‌లుగా సాగుతున్న సీబీఐ విచార‌ణ‌కు ముగింపు నేడోరేపో అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌త్య కేసులో నిందితులు ఎవ‌ర‌నేది తేలితే త‌ప్ప కేసు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం లేదు.