శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో 30 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఆ ప్రత్యేకమైన పాత్ర కోసం వివిధ భాషలకు చెందిన కొంతమంది పెద్ద నటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. అలా ప్రాజెక్టుకు పాన్-ఇండియా అప్పీల్ తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్.
హిందీలో ఈ ప్రత్యేక పాత్ర కోసం సల్మాన్ ను అనుకుంటున్నారు. చరణ్-సల్మాన్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ సహాయంతో ఈ పాత్ర కోసం కండల వీరుడ్ని ఒప్పించే కార్యక్రమాన్ని ఇదివరకే మొదలుపెట్టారు.
ఇక తమిళ్ లో ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకుంటున్నారు. మెగా కాంపౌండ్ కు దగ్గర వ్యక్తి విజయ్ సేతుపతి. సైరా, ఉప్పెన లాంటి సినిమాల్లో నటించడంతో పాటు నిహారికతో కలిసి ఓ తమిళ సినిమా కూడా చేశాడు. కాబట్టి తమిళ వెర్షన్ వరకు దాదాపు విజయ్ సేతుపతి ఫిక్స్.
ఇక కన్నడ వెర్షన్ కు వచ్చేసరికి సుదీప్ లేదా ఉపేంద్రలో ఒకర్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రత్యేక పాత్రలు చేయడానికి ఇద్దరూ సిద్ధమే. ఎవర్ని తీసుకోవాలనేది మేకర్స్ ఇష్టం.
ఎటొచ్చి తెలుగు వెర్షన్ తోనే చిక్కొచ్చిపడింది. తెలుగులో ఈ పాత్ర కోసం పవన్ లేదా చిరంజీవిని తీసుకోవాలనేది ప్రాధమిక ఆలోచన. అయితే మధ్యలో శంకర్ కలుగజేసుకొని రామ్ చరణ్ తోనే కొత్త గెటప్ తో ఆ పాత్రను వేయిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పెట్టాడు. ఇది తెగితే, మిగతా భాషల్లో ఇతర నటుల ఎంపిక, ప్రకటన చకచకా పూర్తిచేస్తారు.