ఏళ్ల నాటి శని పట్టిపీడిస్తోందంట!

అతడో నట వారసుడు. అతడి డెబ్యూ కోసం ఓ సెక్షన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఎప్పటికప్పుడు అతడి ఎంట్రీ ఆలస్యమౌతూనే ఉంది. ఇదిగో తోక అంటే అదిగో పులి టైపులో.. ప్రతి ఏటా అతగాడిపై…

అతడో నట వారసుడు. అతడి డెబ్యూ కోసం ఓ సెక్షన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఎప్పటికప్పుడు అతడి ఎంట్రీ ఆలస్యమౌతూనే ఉంది. ఇదిగో తోక అంటే అదిగో పులి టైపులో.. ప్రతి ఏటా అతగాడిపై పుకార్లు రావడం, ఫ్యాన్స్ బట్టలు చించుకోవడం, ఆ తర్వాత పాల పొంగు మాదిరి తుస్సుమనడం సర్వసాధారణం అయిపోయింది.

అతడు గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నాడని ఓసారి లీక్ ఇచ్చారు. అతడు యాక్టింగ్ లో ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్లాడని మరో ఏడాది. అతడు కథలు వింటున్నాడని ఇంకో ఏడాది. స్వయంగా తండ్రి దర్శకత్వంలోనే హీరోగా వస్తాడంటూ మరో ఏడాది. ఇలా ఏటా అతడి డెబ్యూపై ఊహాగానాలు రావడం, ఏళ్లకు ఏళ్లు గడిచిపోవడం జరిగిపోతూనే ఉన్నాయి.

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా అతగాడి డెబ్యూపై కథనాలు షురూ అయ్యాయి. ఈ ఏడాది ఊహాగానం ఏంటంటే, అతగాడి శిక్షణ, అన్ని రకాలుగా పూర్తయిందంట. ఇక తెరపైకి రావడమే ఆలస్యం అంటూ కథనాలు.

ఇన్నేళ్లుగా ఇన్ని కథనాలు రావడం వెనక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. జాతకాలు బాగా నమ్మే ఆ కుటుంబం, నటవారసుడ్ని తెరపైకి తీసుకురావడానికి ఎన్నడూలేనంత ఎక్కువగా ఎక్కువగా పంచాంగాలు తిరగేశారంట. గ్రహాల స్థితిగతుల్ని బాగా అధ్యయనం చేశారంట. చివరికి తేలిందేంటంటే, సదరు నటవారసుడు ఏళ్లనాటి శనితో బాధపడుతున్నాడట.

ఆ విషయం బయటకు చెప్పడం కుదరదు కదా. అందుకే గుర్రపుస్వారీ, కత్తిసాము అంటూ ఏళ్లకుఏళ్లు గడిపేశారు. ఈ గ్యాప్ లో అతడు తన డెబ్యూ ఇచ్చే వయసు కూడా దాటిపోయాడు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, తాజాగా ఆ శని ప్రభావం నుంచి ఆ వారసుడు బయటపడ్డాడంట. కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు మరో ముహూర్తం తీయాలి. కథ-దర్శకుడ్ని లాక్ చేయడానికి ఇంకో ముహూర్తం తీయాలి. సెట్స్ పైకి వెళ్లడానికి మరో ముహూర్తం. ఇలా సాగబోతోంది అతగాడి కొత్త సినీ ప్రస్థానం.