విశాఖ ఖ్యాతి ఏంటో బయట జనాలకే బాగా తెలుసు. విశాఖను రాజధానిగా అంగీకరించలేని మనస్తత్వాలు ఏపీలో ఉండొచ్చు కానీ బయట వారికి సిటీ ఆఫ్ డెస్టినీ ప్రాముఖ్యత బాగా తెలుసు. విశాఖలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దిగ్గజ కంపెనీలు ఎన్నో సుముఖంగా ఉన్నాయి.
వాటిలో కొన్ని ల్యాండ్ అయ్యాయి. కొన్ని ప్రోసెస్ లో ఉన్నాయి. మరి కొన్ని పరిశీలనలో ఉన్నాయి. ఐటీ రాజధానిగా విశాఖకే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ తో పాటు ఇన్ఫోసిస్ ఉన్నాయి. మరి కొన్ని అదే బాటలో ఉన్నాయి.
తాజాగా తెలిసిన ముఖ్య సమాచారం ఏంటి అంటే ఐటీ ఫీల్డ్ లో బ్రాండ్ ఉన్న క్యాప్‌జెమినీ అనే సంస్థ విశాఖలో తన సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో ఆసక్తిని చూపిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే ఒక సర్వే కూడా చేయించుకుందని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వంతోనూ ఈ దిశగా చర్చలు కూడా జరుపుతోందని అంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో తన సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా విస్తరించుకోవాలన్న ఆలోచనతో ఉన్న క్యాప్‌జెమినీ కి విశాఖ మీద చూపు పడింది అని అంటున్నారు.
క్యాప్‌జెమినీ వర్క్ ప్లేస్ సెంటర్ తొందరలోనే విశాఖలో ఏర్పాటు కానుంది అన్నది రూఢీగా తెలుస్తున్న భోగట్టా. ఈ సంస్థ కనుక తన వర్క్ ప్లేస్ సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేస్తే విశాఖలో ఐటీ బూమ్ కి మరింత ఊతం లభించినట్లే అంటున్నారు. రానున్న రోజులలో మరికొన్ని కంపెనీలు కూడా విశాఖ బాట పట్టనున్నాయని చెబుతున్నారు. ఏపీలో ఏర్పాటు అయ్యే కొత్త ప్రభుత్వం ఆలోచనలు చూసిన తరువాత విశాఖలో అడుగు పెట్టడానికి కూడా కొన్ని కంపెనీలు చూస్తున్నాయని అంటున్నారు.