ఆయన అయిదేళ్ల క్రితం విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడ్డారు. రెండు లక్షల ఎనభై వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయని బహుశా ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. ఆ తరువాత ఆయన జనసేన నుంచి వీడి బయటకు వచ్చారు.
వెంటనే పార్టీ పెట్టి ఉంటే 2024 నాటికి కొంత వరకూ బాగుండేది. కానీ ఎన్నికలకు ముందు జై భారత్ నేషనల్ అని పార్టీని పెట్టారు. ఆయన ఎంపీగా విశాఖ నుంచి అంటూ చివరి దాకా చెప్పి విశాఖ నార్త్ అసెంబ్లీకి పోటీ చేశారు. అక్కడ ఆయన విజయం సాధిస్తే అద్భుతమే అవుతుంది. అయితే ఆయన ఓట్లు బాగానే చీలుస్తారు అని అంటున్నారు. ఆ దెబ్బ ప్రధాన పార్టీలలో ఎవరికి పడుతుందో తెలియదు.
ఉన్నట్లుండి జేడీ నోట ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వస్తోంది. పదేళ్ళు పూర్తి అయింది కాబట్టి మరింత కాలం అని ఆయన అంటున్నారు. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వల్ల ఎవరికి లాభం అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే తొంబై శాతం పైగా సంస్థలు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేశాయి.
ఇపుడు ఎవరూ హైదరాబాద్ ఏపీ ఉమ్మడి రాజధాని అని భావించడం లేదు. అయితే దీని వెనక రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్నదే చర్చ సాగుతోంది. ఉమ్మడి రాజధానిగా ఏపీ నుంచి డిమాండ్ వస్తే తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అది ఎవరికి ఉపయోగకరమో రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి అర్ధం అయ్యే విషయమే.
అయితే ఏపీకి చెందిన జేడీ ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు అన్నదే ప్రశ్నగా వస్తోంది. ఆయన తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడం, ఇపుడు ఈ డిమాండ్ ని లేవనెత్తడంతో అసలు ఉమ్మడి వ్యూహాలు ఏమైనా అటూ ఇటూ ఉన్నాయా అన్న చర్చకు తెర లేస్తోంది. ఏపీలో ఎవరికీ పట్టని ఉమ్మడి హైదరాబాద్ డిమాండ్ ని జేడీ నెత్తికెత్తుకోవడమే విశేషం. అయితే ఆయన డిమాండ్ కి ప్రతుతానికి ఎవరూ మద్దతుగా మాట్లాడటం లేదు. బహుశా ఎన్నికలు అయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేసే వీలు ఉండొచ్చు అని అంటున్నారు.