Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ వైఖరిపై వైకాపా కన్ను

టాలీవుడ్ వైఖరిపై వైకాపా కన్ను

ఏడాది అయింది ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటై. కానీ టాలీవుడ్ కు మాత్రం ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు. సహజంగానే టాలీవుడ్ లో చాలా మంది తెలుగుదేశం మద్దతు దారులు. మిగిలిన వారు జనసేన అభిమానులు. అతి కొద్ది మంది మాత్రమే వైకాపా సింపథైజర్లు వున్నారు.  జగన్ సిఎమ్ అయిన తరువాత అభినందించడానికి కూడా టాలీవుడ్ జనాలు ముందుకు రాలేదు. దానిపై విమర్శలు వినిపించాయి. 

ఆ తరువాత కొందరు పెద్దలు కామ్ గా కలిసి వచ్చారు. సైరా సినిమా సందర్భంగా మెగాస్టార్ అపాయింట్ మెంట్ అడిగితే, సతీసమేతంగా రమ్మని సాదరంగా ఆహ్వానించి, విందు ఇచ్చి, గౌరవించి పంపించారు జగన్. టాలీవుడ్ వైఖరి ఎలా వున్నా, జగన్ మాత్రం చాలా సానుకూలంగానే వుంటూ వచ్చారు. అదనపు ఆటలు అడిగిన వారందరికీ లేదనకుండా ఇస్తూ వస్తున్నారు. కానీ టాలీవుడ్ మాత్రం ఈ విషయంలో వేరుగా వెళ్తోందని విమర్శలు వినిపిస్తూనే వున్నాయి.

సినిమా జనాలు విరాళాలు ప్రభుత్వానికి ఇవ్వకుండా మధ్యలో సిసిసి అని ఏర్పాట్లు చేసి, డైవర్ట్ చేసారని. ఇలాంటిది తొలిసారి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సినిమాలు, షూటింగ్ లు ప్రారంభించడానికి కేవలం తెలంగాణ ప్రభుత్వంతోనే సంప్రదింపులు ప్రారంభించారు. ఈ విషయంలో ఆంధ్రలో కూడా ప్రభుత్వం వుందని, అక్కడ కూడా అవసరాలు వుంటాయని అస్సలు గమనిస్తునట్లు లేదు. 

ఇప్పుడు ఇదే విషయాన్ని వైకాపా నాయకులు జగన్ దృష్టికి తెస్తున్నట్లు బోగట్టా. మరీ మెతకవైఖరి అవలంబిస్తే ఇలాగే వుంటుందని, షూటింగ్ లు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ తెలంగాణలో వున్నా, థియేటర్లు, ఎక్కువ ఆదాయం వచ్చేది ఆంధ్ర, సీడెడ్ ల నుంచే అని, అందువల్ల అటునుంచి నరుక్కు రావాలని వైకాపా నేతలు జగన్ కు విన్నవిస్తున్నట్లు పార్టీ వర్గాల బోగట్టా.

థియేటర్ల లెక్కలు కట్టుదిట్టంగా తీయడం, థియేటర్ల దగ్గర నిబంధనలు పక్కాగా అమలు చేయడం ద్వారా ఇటు ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని, అలాగే టాలీవుడ్ లో వున్న థియేటర్ మాఫియా దిగివస్తుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. థియేటర్ల కేంటీన్ వ్యవహారాలు, డీఆర్సీ లెక్కలు పక్కాగా పట్టించుకుంటే, టాలీవుడ్ జనాలకు ఆంధ్రలో ప్రభుత్వం వుందన్న వ్యవహారం గుర్తుకు వస్తుందని, లేదంటే ఇలాగే వుంటుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కు తాము కచ్చితంగా టాలీవుడ్ లొసుగులు సవివరంగా అందిస్తామని, టాలీవుడ్ లోని ఓ వైకాపా అభిమాన నిర్మాత అన్నారు.

టోటల్ గా టికెట్ సేల్ అంతా ఆన్ లైన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచవచ్చని, ఫేక్ కలెక్షన్లు, ఫేక్ రికార్డులు ఆగిపోతాయని, అప్పుడు హీరోల అసలు స్టామినా తెలుస్తుందని, దాన్ని బట్టే రెమ్యూనిరేషన్లు వుంటాయని, అందువల్ల థియేటర్ల దగ్గర బటన్ నొక్కితే టాలీవుడ్ కదలడం ప్రారంభమవుతుందని ఆ నిర్మాత అన్నారు. 

ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం జగన్ దగ్గరే వుంది. అందువల్లనే టాలీవుడ్ జనాలు ఎక్కువగా సంప్రదించడానికి కుదరడం లేదని కొందరు నిర్మాతలు అంటున్నారు. అంతకు మించి మరేమీ కాదని వారు వివరిస్తున్నారు. మొత్తం మీద లాక్ డౌన్ తరువాత మాత్రం ఆంధ్రలో టాలీవుడ్ వ్యవహారాలపై ఓ కన్ను పడే అవకాశం వుందని గట్టిగా వినిపిస్తోంది.

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?