Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనా.. నిర్మాతలకు కలిసొస్తుందా?

కరోనా.. నిర్మాతలకు కలిసొస్తుందా?

కరోనా లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. థియేటర్లలో ఉన్న చిన్నా చితకా సినిమాల భవిష్యత్ అర్థాంతరంగా ముగిసిపోయింది, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కలెక్షన్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. చకచకా పనులు జరుగుతున్న క్రేజీ ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల విషయం పర్లేదు కానీ.. రోజు కూలీతో నెట్టుకొచ్చే కార్మికులు అప్ కమింగ్ ఆర్టిస్టుల జీవితాల్లో పెద్ద కుదుపు ఇది.

కరోనా కథ దాదాపుగా ముగిసినట్టే.. ఆంక్షల సడలింపుతో రోజువారీ జీవనం తిరిగి ప్రారంభమవుతోంది. సినిమా భవిష్యత్ పై పెద్దలు, ప్రభుత్వ అధినేతలతో చర్చించడం మొదలుపెట్టేసరికి.. స్టార్ట్-కెమెరా- యాక్షన్.. ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. మరి కరోనా తర్వాత చిత్ర పరిశ్రమ ఎవరికి కలిసొస్తుందనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.

లాక్ డౌన్ తర్వాత జనజీవనాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరూ కరోనాకి భయపడ్డంలేదు, మాస్క్ లు అలవాటుపడ్డాయి కానీ వ్యక్తిగత దూరం విషయాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో థియేటర్లు తెరిస్తే జనాలు వస్తారా రారా అనే విషయంపై ఇప్పటికే సినీ పెద్దలకు పూర్తి క్లారిటీ వచ్చింది. మాల్స్, థియేటర్లు తెరవాలే కానీ జనం ఎగిరి గంతేసి మరీ వచ్చేస్తారనే విషయం అర్థమైంది. సినిమా హాళ్లలో సీటింగ్ మార్చినా, మార్చకపోయినా హౌస్ ఫుల్స్ కావడం మాత్రం గ్యారెంటీ అని తెలిసిపోయింది..

అంటే నిర్మాతల పైసా వసూల్ కి ఢోకా లేదన్నమాట. అదే సమయంలో సినీ రంగంలో వచ్చిన మరో పెద్ద మార్పు కూడా నిర్మాతలకి అనుకోని వరంగా మారింది. ఇప్పటికే నటీనటులు కొందరు తమ పారితోషికాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకుంటామని ముందుకొచ్చారు. షూటింగ్ ల కోసం గతంలో లాగా ఎక్కువమంది జనాల్ని తీసుకోలేమని స్వయానా దర్శకుడు రాజమౌళే నిన్నటి "మెగా మీటింగ్" లో సెలవిచ్చారు. అలాంటి భారీ దర్శకుడే వెనకడుగేస్తే.. మిగతా దర్శకులు ధైర్యం చేస్తారా. భారీ తారాగణం, జూనియర్ ఆర్టిస్ట్ ల హడావిడి, ఖర్చు బాగా తగ్గిపోవడం ఖాయం.

ఇక ఫారిన్ షెడ్యూల్స్ ఇప్పుడప్పుడే ఉండవు కాబట్టి ఆ ఖర్చు కూడా కలిసొస్తుంది. కరోనా పేరుతో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశమూ ఉంది. ఓటీటీ భారీ ఆఫర్లు ఇప్పటికే నిర్మాతలను కవ్విస్తున్నాయి. కరోనా వేళ సోషల్ మీడియా ట్రెండ్ బాగా పెరిగింది కాబట్టి, ప్రచారానికి పెట్టే ఖర్చు కూడా తగ్గినట్టే.

సో ఎలా చూసుకున్నా.. లాక్ డౌన్ తర్వాత నిర్మాతల్లో కాస్త నిబ్బరం పెరగడం ఖాయం. అనవసర ఖర్చు తగ్గిపోయి, పెట్టే ప్రతి పైసాకు రిటర్న్స్ వచ్చే నమ్మకం కుదిరింది. అంటే కరోనా సినీ నిర్మాతలకు పరోక్షంగా మేలు చేసిందనే చెప్పాలి. రాగాపోగా ఓవర్సీస్ బిజినెస్సే కాస్త నెమ్మదించేలా ఉన్నా, దాన్ని ఓటీటీ భర్తీ చేస్తే నిర్మాతలకు ఇక దిగులే లేదు. 

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?