హీరోలంతా కలిసిపోయారు. ఎలాంటి విభేదాలు లేవు. అంతా కూల్ కూల్. నీది నాది తెనాలి లాంటి డైలాగులు కూడా వచ్చేశాయి. కానీ ఇప్పుడిలా కలిసిపోవడంతోనే తేడాలు కూడా బయటపడ్డాయి. హీరోల మధ్య పొరపొచ్చాలు తెరవెనక రచ్చకెక్కుతున్నాయి. మొన్నటికి మొన్న భరత్ అనే నేను ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. దీనికి పోటీగా ప్రభాస్ ను తన ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నాడు బన్నీ. దీని వెనక చాలా పెద్ద కథే నడిచింది.
భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ వేడుకకు చరణ్ వెళ్లలేకపోయాడు. కానీ ఈవెంట్ తర్వాత ఏర్పాటుచేసిన స్పెషల్ పార్టీకి మాత్రం వెళ్లాడు. సేమ్ టైం మెగా కాంపౌండ్ లో ఉన్న బన్నీకి మాత్రం ఆహ్వానం అందలేదు. సరిగ్గా ఇక్కడే మొదలైంది అసలు రచ్చ. తనను ఆహ్వానించకపోవడంపై బన్నీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
భరత్ అనే నేను ఈవెంట్ కు ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తే, తన ఫంక్షన్ కు ప్రభాస్ ను ఆహ్వానించడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ నెలాఖరుకు నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఆ వేడుకకు ప్రభాస్ హాజరవుతాడని టాక్. అంతేకాదు.. మహేష్ టైపులో బన్నీ కూడా ఆ ఈవెంట్ తర్వాత భారీ పార్టీ ప్లాన్ చేశాడు.
వాళ్లు ఎన్టీఆర్ ను పిలిచారు కాబట్టి, వీళ్లు ప్రభాస్ ను పిలుస్తున్నారు. ఇందులో తప్పేముంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ చాలా ఈక్వేషన్లు, మరెన్నో కాలిక్యులేషన్లు నడుస్తున్నాయి. ఓ హీరోను పిలవడం వెనక చాలా హైడ్రామానే నడుస్తోంది. ఉదాహరణకు మెగా కాంపౌండ్ నే తీసుకుంటే రంగస్థలం సక్సెస్ మీట్ కు పవన్ కల్యాణ్ ను పిలిచారు. సో.. ఆటోమేటిగ్గా ఆ వేడుకకు బన్నీ రాడు.
కానీ సేమ్ టైం, నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి వెళ్లడం లేదు. చివరికి రామ్ చరణ్ కూడా హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇక్కడ మళ్లీ లెక్కలు మారిపోతున్నాయి. ఒక్క మెగా కాంపౌండ్ లోనే ఇలా ఉంటే.. మిగతా కాంపౌండ్స్ లో సఖ్యత గురించి ఇక చెప్పనక్కర్లేదు. నాగార్జున ఏదైనా ఈవెంట్ పెడితే దానికి బాలయ్య వెళ్లడు. అటు నందమూరి హీరోల ఫంక్షన్లకు మరికొందరు హాజరవ్వరు. ఇలా ఎవరికి వారే హీరోల్ని వాటాలు వేసుకుంటున్నారు.
ఇప్పుడీ రాజకీయాల మధ్య తటస్థంగా ఉండే హీరోలు కొందరు నలిగిపోతున్నారు. ఉదాహరణకు నానినే తీసుకుంటే.. ఈమధ్య ఓ ఫంక్షన్ కు ఇతడ్ని గెస్ట్ గా పిలిచారు. నానికి అతగాడు క్లోజ్ ఫ్రెండ్ కూడా. కానీ ఆ వేడుకకు వెళ్తే, మరో హీరోకు కోపమొస్తుంది. అందుకే నాని వెళ్లలేదు. ఇలా రెండు వర్గాల మధ్య నలిగిపోతున్న హీరోల్లో నానితో పాటు మరికొందరు కూడా ఉన్నారు.
ఒకే వేదికపై స్టార్ హీరోలు కలవడం అనేది శుభ పరిణామంగా పైకి కనిపించవచ్చు. కానీ దీని వల్ల ఇలాంటి కొత్త సమస్యలు పుట్టుకురావడం మాత్రం ఖాయం. ''మా ఎన్టీఆర్ సపోర్ట్ మీకు ఉంటుంది, మహేష్ బాబుకు ఇక ఫ్లాపులుండవ్'' అంటూ సోషల్ మీడియాలో ఓ గ్రూప్ పోస్టులు పెడుతోందంటే అది ఎలాంటి సంకేతాలు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.
సో.. ఓ పెద్ద హీరో సినిమా ఫంక్షన్ కు మరో బడా హీరో వెళ్లడం ఇప్పుడు సరికొత్త సమస్యలకు, వర్గ రాజకీయాలకు దారి తీస్తోంది. మేమంతా బాగానే ఉన్నాం, మీరు మీరే బాగుండాలి అంటూ మైక్ పట్టుకొని డైలాగులు కొట్టినప్పటికీ.. తెరవెనక హీరోల వ్యవహారం కూడా 'మాకు మేమే' అన్నట్టు తయారైంది.