రంగస్థలంతో సూపర్ హిట్ కొట్టాడు సుకుమార్. ఇప్పుడీ డైరక్టర్ తో సినిమా చేసేందుకు హీరోలంతా సిద్ధమే. కానీ వీళ్లలో 80శాతం మంది ఖాళీగా లేరు. మిగిలిన 20శాతం మందిలో స్టార్ డమ్ ఉన్న వాళ్లు చాలా తక్కువ. అలాంటి వాళ్లలో బన్నీ ఒకడు.
నా పేరు సూర్య సినిమాను పూర్తిచేసిన అల్లు అర్జున్ ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. సో.. సుకుమార్ తో కలిసి బన్నీ మరోసారి సెట్స్ పైకి వెళ్లే చాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ పుకారు ఇలా నడుస్తుండగానే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది.
గతంలో మహేష్, సుక్కూ కాంబోలో వన్-నేనొక్కడినే సినిమా వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మహేష్ తో ఎలాగైనా మరో సినిమా తీసి హిట్ ఇస్తానని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నాడు సుకుమార్. ఇందులో భాగంగా ఈ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును మహేష్ తో చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.
ఏ హీరోతో సినిమా చేసినా అది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే ఉంటుదనే విషయం పక్కా. గతంలో మహేష్ తో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. సో.. బ్యానర్ సైడ్ నుంచి సమస్యలు లేవు. ఎటొచ్చి మహేష్-సుకుమార్ మధ్య స్టోరీ లాక్ అవ్వాలి. త్వరలోనే కుటుంబంతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేశాడు సుకుమార్. ఆ తర్వాత కథపై కూర్చుంటానని, అప్పుడు మాత్రమే హీరోపై క్లారిటీ వస్తుందని అంటున్నాడు.