తెలుగు సినిమాలకు ఇప్పుడు అతి పెద్ద ఆదాయ వనరుగా మారాయి హిందీ డబ్బింగ్ రైట్స్. కాస్త మాంచి ఫైటింగ్ సీన్లు, కమర్షియల్ సీన్లు వుంటే మాంచి రేటు పలుకుతోంది. తెలుగునాట ఓ మాదిరిగా పేరు వున్న హీరోల సినిమాలు కూడా హిందీ డబ్బింగ్, డిజిటల్ అంటే చాలు కోట్లకు కోట్లు పలికేస్తున్నాయి. హీరో రెమ్యూనిరేషన్ కు మించి వుండడంతో, చాలా మంది ఆయా హీరోలను ఈ అమ్మకం దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తున్నారు.
టాలీవుడ్ కింగ్ పిన్ లాంటి దగ్గుబాటి సురేష్ బాబు ఆ మధ్య ఓ మాట అన్నారు. తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ మాంచి ఆదాయంగా మారిందని, ఫ్లాపు హీరోలకు కూడా డిమాండ్ వుండడానికి ఇదో కారణం అనే అర్థంవచ్చేలా ఆయన మాట్లాడారు. దాని ఎఫెక్ట్ పడిందో ఏమో? హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మకాలకు బ్రేక్ పడిపోయింది.
తెలుగు జనాల వ్యాపారం, ఈ వ్యవహారాలు గమనించిన, బాలీవుడ్ కొనుగోలు దారులు రింగ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఇప్పుడు రకరకాల టెర్మ్స్ పెడుతున్నట్లు బోగట్టా. పైగా జీ టీవీ కొనుగోళ్లు తగ్గించేయడం కూడా వాళ్లకు కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. సవాలక్ష నియమ నిబంధనలు పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. చూసీ చూడకుండా సంతకాలు పెట్టి ఇక్కడ నిర్మాతలు ఇరుక్కుంటున్నారని తెలుస్తోంది.
వాల్మీకి కోటిన్నర నోటీసు..
వాల్మీకి సినిమా నిర్మాతలు ఇప్పుడు ఇలాంటి తకరారులోనే ఇరుక్కున్నారని తెలుస్తోంది. కోటిన్నర రూపాయలకు వాళ్లకు హిందీ డబ్బింగ్ కొనుగోలుదారుల నుంచి ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో యాభైలక్షలు వెనక్కు ఇస్తామని రాజీయత్నాలు జరుగుతున్నట్లు బోగట్టా. కానీ కోటికి తగ్గేదిలేదని అవతలి పార్టీ పట్టుపట్టినట్లు తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో రాబోయే భారీ సినిమాలు సరిలేరు నీకెవ్వరూ, సామజవరగమన సినిమాల హిందీ డబ్బింగ్ అమ్మకాలు నిలిచిపోయాయి. అమ్ముదామన్నా, వారు కొంటామన్నా, కొనుగోలు దారులు పెట్టే కండిషన్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి అన్నది టాలీవుడ్ టాక్. దాంతో ప్రస్తుతానికి పెద్ద సినిమాల హిందీ శాటిలైట్ హక్కుల అమ్మకానికి బ్రేక్ పడిపోయింది.
హిందీ చానెళ్లకు తెలుగు డబ్బింగ్ సినిమాలు అవసరమే కానీ, నేరుగా కొనడంలేదు. అవి ఈ మధ్యవర్తుల దగ్గరే కొంటున్నాయి. అలా కొనేవాళ్లు ఒకరిద్దరే కావడం, వాళ్లు రింగ్ కావడంతో తెలుగు సినిమాల హిందీ అమ్మకాలకు గ్రహణం పట్టేటట్లే కనిపిస్తోంది.