బాహుబలి. టాలీవుడ్ ఇండస్ట్రీ పేరును, తెలుగు సినిమా పేరును దశదిశలా వ్యాపించేలా చేసిన సినిమా. తెలుగు సినిమా స్థాయి వేయి కోట్లు అని చాటిన సినిమా. కానీ అదే బాహుబలి దర్శకుడు రాజమౌళి అందించబోతున్న ఆర్ఆర్ఆర్ మాత్రం టాలీవుడ్ కు తీరని నష్టం చేసిందన్నది ఇండస్ట్రీ జనాలు అంటున్న మాట.
ఆర్ఆర్ఆర్ ప్లానింగ్, అనుకోని ఆలస్యం, కరోనా ఇలా అన్నీ కలిసి టాలీవుడ్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేయి కోట్ల వరకు నష్టంచేసింది అని లెక్కలు కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా ఇద్దరు టాప్ హీరోలు. రెండు, మూడేళ్ల కాలం లాక్ అయిపోయారు. ఆర్ఆర్ఆర్ సంగతి పక్కన పెడితే ఈ టైమ్ లో ఆ ఇద్దరు చెరో రెండు సినిమాలు చేసి వుండేవారు.
ఆ హీరోల రేంజ్ ను బట్టి అవి కచ్చితంగా వంద కోట్ల రేంజ్ సినిమాలు. కలెక్షన్ల ప్రకారం కనీసం ఒక్కో సినిమా 150 నుంచి 200 కోట్ల టర్నోవర్ వుండాల్సిన సినిమాలు. ఆ విధంగా దాదాపు ఆరు నుంచి ఎనిమిది వందల కోట్ల టర్నోవర్ ఇటు ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల మీదుగా నిర్మాతల వరకు పోయినట్లే.
ఇక ఈ హీరోల కోసం వెయిట్ చేస్తూ వేరే డైరక్టర్లు వెయిటింగ్ లో వుండిపోయి, సరైన టైమ్ లో సినిమాలు చేయలేక మిస్సయిపోయిన కారణంగా ఆగిపోయిన టర్నోవర్ మరికొంత. ఇలా అన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా లెక్కలు వేసుకుంటే వేయి కోట్ల టర్నోవర్ టాలీవుడ్ కు ఒక్క ఆర్ఆర్ఆర్ వల్ల మిస్ అయిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.