ఓ ప్రముఖ హీరోయిన్, ఇద్దరు యంగ్ హీరోలు.. ఓ డ్రగ్స్ వ్యవహారం.! ఇదీ తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ రచ్చకి సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన 'లీకుల' సారాంశం. ఇంతకీ, ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరు.? ఆ ఇద్దరు యంగ్ హీరోల సంగతేంటి.? తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడీ ట్రయాంగిల్ 'డ్రగ్స్ స్టోరీ' గురించి రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
'తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం..' అంటూ మొదట మీడియాలో ప్రచారం జరిగితే, 'అంతా నాన్సెన్స్..' అని కొట్టి పారేశారు చాలామంది సినీ ప్రముఖులు. అయితే, తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 'సిట్', 'ఆ పన్నెండు మందికి' నోటీసులు జారీ చేశాక, 'అవును, కొందరున్నారు..' అని అదే సినీ ప్రముఖులు మీడియా ముందుకొచ్చి కొత్త కథ చెప్పారు. 'అబ్బే, అలాంటోళ్ళెవరూ వుంటారని మేం అనుకోవడంలేదు..' అని కూడా ఆ సినీ ప్రముఖులే ఆ తర్వాత ఖండించిన విషయమూ గుర్తుండే వుంటుంది.
పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, తరుణ్, నవదీప్, ముమైత్‌ఖాన్.. ఇలా 12 మంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు 'సిట్' యెదుట విచారణకు హాజరయ్యారు. అయితే, వీరిలో ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారు.? అసలు వాడుతున్నారా.? లేదా.? వాడకమేనా.? అమ్మకాలు కూడానా.? అన్న విషయమై 'సిట్' ఇంతవరకూ ఎటూ తేల్చలేదు. 'అదేదో మామూలు విచారణ మాత్రమే..' అంటూ తాజాగా, పూరి జగన్నాథ్ 'డ్రగ్స్ కేసు'పై తేల్చేశాడనుకోండి.. అది వేరే విషయం.
మరిప్పుడు, ఆ ఇద్దరు యంగ్ హీరోలు – ఓ ప్రముఖ హీరోయిన్ సంగతేమవుతుందో.! నిజానికి ఆ ఇద్దరు యంగ్ హీరోల వ్యవహారంపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ వున్న ఓ యంగ్ హీరో కూడా అందులో వున్నాడట. ఆ హీరోయిన్ అయితే, డ్రగ్స్ మోతాదు ఎక్కువైపడిపోతే, సినిమా యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించిందట. ఇంకా చాలా చాలా 'కథలు' ప్రచారంలో వున్నాయి.
'ఓ పెద్దకుటుంబానికి చెందిన..' అంటూ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సాక్షాత్తూ మీడియా సమావేశంలో 'క్లూ' ఇచ్చినా, ఆ వ్యక్తి విచారణకూ హాజరు కాలేదు, ఆ వ్యవహారమూ మళ్ళీ తెరపైకి రాలేదు. సో, ఇప్పుడు విన్పిస్తున్న లీకుల వ్యవహారం ఏమవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది. డ్రగ్స్ పేరుతో టాలీవుడ్‌లో ప్రకంపనలు కావాలనే సృష్టిస్తున్నారా.? అన్న అనుమానాలకు తావిచ్చేలా ఈ లీకులు రావడం ఏమాత్రం సమంజసంగా అనిపించడంలేదు.