టాలీవుడ్ లో హారిక కొత్త ట్రెండ్

టాలీవుడ్ చరిత్రలో ఓ అద్భుతం చేసారు అనే చెప్పుకోవాలి. సినిమా విడుదలయి, డిజాస్టర్ అయితే నెలలోపు బయ్యర్లకు అందరికీ ఏదోవిధంగా సెటిల్ చేయడం అంటే రికార్డే. సుమారు 22 కోట్ల రూపాయిలు బయ్యర్లు వెనక్కు…

టాలీవుడ్ చరిత్రలో ఓ అద్భుతం చేసారు అనే చెప్పుకోవాలి. సినిమా విడుదలయి, డిజాస్టర్ అయితే నెలలోపు బయ్యర్లకు అందరికీ ఏదోవిధంగా సెటిల్ చేయడం అంటే రికార్డే. సుమారు 22 కోట్ల రూపాయిలు బయ్యర్లు వెనక్కు ఇవ్వడం అంటే అది చిన్న విషయంకాదు. టాలీవుడ్ చరిత్రలో ఇది అరుదైన సంఘనటగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏళ్లు పూళ్లు పట్టినా ఒక్కసారి కూడా పైసా వెనక్కు ఇచ్చిన దాఖలాలు తక్కువ. అదే విధంగా ఇన్ని కోట్లరూపాయిలు వెనక్కు ఇచ్చినా, ఎక్కడా తమంతట తాము చెప్పకపోవడం మరీ విశేషం.

గతంలో సినిమాలు డిజాస్టర్ అయినపుడల్లా హీరోలు ఇంతవెనక్కు ఇచ్చారు, అంత వెనక్కు ఇచ్చారు అన్న ఫీలర్లే తప్ప, ఇచ్చిందిలేదు. పైగా తరువాత మరో సినిమా చేస్తాం అనడమే తప్ప, చేసింది లేదు. ఒకే ఒక్కసారి వివి వినాయక్ రెండుకోట్ల వరకు వెనక్కు ఇచ్చారు. అంతకు మించి ఇలా వెనక్కు ఇచ్చింది లేదు. తరువాత సినిమా తీసినపుడు గొడవలుపడడం, కిందామీదా కావడం, కోర్టులకు వెళ్లడం తప్ప, ఇలా సెటిల్ చేసిన దాఖలాలులేవు.

అజ్ఖాతవాసి సినిమా విడుదలయి, ఫలితం తేలిపోయిన వారానికే నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఫిక్సయిపోయారు. తనకు వచ్చిన లాభం ఇంత, తాను చేయగలిగింది ఇంత అని క్లియర్ గా బయ్యర్లకు చెప్పి, జనవరి 26కు అంటే సినిమా విడదలయిన జస్ట్ 17 రోజులకే సెటిల్ చేస్తానన్నారు. పోయిన మేరకు ఇవ్వలేకపోయినా, ఇవ్వగలిగిన మేరకు ఇవ్వడం అంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఈ విషయంలో చినబాబుకు మద్దతుగా త్రివిక్రమ్ కూడా తనవంతుగా అయిదుకోట్లు వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా చేయడంపై కానీ, డబ్బులు వెనక్కు ఇవ్వడంలో కానీ ఆసక్తి కనబర్చని హీరో పవన్ కళ్యాణ్ కూడా తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ గా అయిదుకోట్లు సమకూర్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇలా 20కోట్ల రూపాయిలను చినబాబు బయ్యర్లకు వెనక్కు అందించారు.

ఇందులో దగ్గర దగ్గరగా దిల్ రాజకు ఏడుకోట్లు, విశాఖ బయ్యర్ కు రెండుకోట్లకు పైగా, అందినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన బయ్యర్లకు యధాశక్తి వెనక్కు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో అరకోటి, కోటి వెనక్కు వచ్చినా, రాకపోయినా పెద్దతేడా వుండదన్న ఒకరిద్దరు బయ్యర్లు తరువాతి సినిమాను తీసుకునే ఆలోచనతో ఆ మేరకు మాట తీసుకుని ఊరుకున్నారు.

అయితే, అంతా బాగానే వున్నా, చిన్న బాధాకర విషయం ఏమిటంటే, భారీగా నష్టపోయిన ఓవర్ సీస్ బయ్యర్ కు మాత్రం ఏమీ అందకపోవడం. జరిగిన నష్టం, వెనక్కు ఇస్తానన్న మొత్తం పెద్దగా మ్యాచ్ కాకపోవడంతో, వాళ్లు తీసుకోలేదని తెలుస్తోంది. తరువాత సినిమా సమయంలో ఏదో విధమైన ఉపశమనం కలిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు బోగట్టా.

ఏమైనా ఇదో కొత్త ట్రెండ్ టాలీవుడ్ లో. ఇకపై భారీ సినిమాలు చేసే నిర్మాతలు, బయ్యర్లు దీన్ని ప్రామాణికంగా తీసుకోవడం మొదలుపెడితే వ్యవహారం వేరుగా వుంటుంది. ఆ విషయంలో కొంతమంది నిర్మాతలు చినబాబు ఇలా చేసి వుండకూడదు అని ఆఫ్ ది రికార్డుగా కామెంట్ చేస్తున్నారు. ఆయనకు లాభం వచ్చింది కాబట్టి, డైరక్టర్ సహకరించారు కాబట్టి వెనక్కు ఇవ్వగలిగారు. పదికోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకునే అనేకమంది డైరక్టర్లు వెనకేసుకోవడమే తప్ప, తేడావచ్చినపుడు ఇచ్చింది లేదని, అలాంటి డైరక్టర్లు ఎక్కువ మంది ఉన్న ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ వెనక్కు ఇవ్వడం అన్నది కష్టం అని అంటున్నారు.

ఏమైనా హారిక చినబాబు టాలీవుడ్ చరిత్రలో ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలికారు అనుకోవాలి.