ఎన్టీఆర్ నుంచి నంబర్‌వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్న తర్వాత మళ్లీ మెగాస్టార్ రీతిన నిలకడ ప్రదర్శించి, వరుస బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన హీరోలు లేరు. పవన్, మహేష్, ఎన్టీఆర్ అడపాదడపా తమ పవర్ చూపించినా కానీ నిలకడగా విజయాలు సాధించలేదు. ఈ కారణంగానే చిరంజీవి తర్వాత నంబర్‌వన్ అని నిక్కచ్చిగా అనిపించుకున్న హీరో లేడు.
ఆ స్థానాన్ని ప్రభాస్ కైవసం చేసుకుంటున్నాడా? 'మిర్చి' తర్వాత 'బాహుబలి 1 అండ్ 2'తో ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అయితే బాహుబలి క్రెడిట్ ఎక్కువ శాతం రాజమౌళి ఖాతాలోకి పోతుంది కనుక ఇకపై ప్రభాస్ నిలకడ చూపించాలి. అంతటి స్కేల్ వున్న సినిమాలు చేయడం తరచుగా జరిగే పని కాదు కనుక ఇకనుంచి చేసే చిత్రాలతో ప్రభాస్ కన్సిస్టెంట్‌గా హిట్లు కొట్టాలి.
ఇప్పటికే యూత్‌లో, మాస్‌లో చాలా ఫాలోయింగ్ వున్న ప్రభాస్ అన్ని సెక్షన్స్‌ని ఆకట్టుకునే హీరోగా ఎదగాలి. హీరో అనిపించుకునే లక్షణాలు అన్నీ వున్న ప్రభాస్‌కి మిగతా యువ హీరోల మాదిరిగా స్ట్రాంగ్ ఫాన్ బేస్ వారసత్వంగా రాలేదు. తనంతట తానుగా ఏర్పరచుకున్న ఫాన్ బేస్‌ని మరింత పెంచుకునే రీతిన ప్రభాస్ రాంగ్ స్టెప్స్ వేయకుండా ముందుకి సాగినట్టయితే నెక్స్‌ట్ చిరంజీవి అనిపించుకునే రోజు ఎంతో దూరంలో లేదు.