మహానాయకుడు డబ్బా మళ్లీ మొదలైంది. మొదటిభాగం పార్ట్-1 కథానాయకుడు రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్ మొత్తం హంగామా చేసింది. దాదాపు 2 రోజుల పాటు అదేపనిగా ట్వీట్ల వర్షం కురిపించింది ఓ వర్గం. కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత యాత్ర సినిమా రిలీజైంది. కథానాయకుడు టైమ్ లో హంగామా చేసిన బ్యాచ్ ఏదీ ఈసారి ఉలుకూ పలుకూ లేదు. అసలు ఈ సినిమా తమది కాదు అన్నట్టు వ్యవహరించింది టాలీవుడ్ మొత్తం.
యాత్ర సినిమాను ఇండస్ట్రీ దూరం పెట్టిందంటూ విమర్శలు చెలరేగినప్పటికీ ఎవరూ స్పందించలేదు. చివరికి ఆ సినిమా దర్శకుడు కూడా దీనిపై వివరణ ఇచ్చాడు. తమకు ఎవరి మెచ్చుకోలు అవసరం లేదని, దయచేసి అభిమానులు ఎవరూ వివాదం చేయొద్దని హుందాగా ప్రవర్తించాడు.
ఇదంతా జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 మహానాయకుడు వచ్చింది. యాత్ర సినిమాలో తమకు పట్టనట్టు వ్యవహరించిన ఓ 'వర్గం' మరోసారి జూలు విదిల్చింది. ఆహా.. ఓహో అంటూ ట్వీట్ల పర్వం ప్రారంభించింది. మహానాయకుడు కాదు, దేవుడు అంటూ పొగడ్తలు కురిపించడం స్టార్ట్ చేసింది.
ఈరోజు థియేటర్లలోకి వచ్చిన మహానాయకుడు సినిమాపై కూడా పెదవి విరుపులు తప్పలేదు. ఎన్టీఆర్ జీవితాన్ని గాలికొదిలేసి చంద్రబాబును హీరోగా చూపించే ప్రయత్నం చేశారని, బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ కు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటూ కామెంట్స్ పడుతున్నాయి.
ఓవరాల్ గా దీన్ని ఎన్టీఆర్ కు సంబంధించిన సంపూర్ణ బయోపిక్ గా ఎవరూ గుర్తించడంలేదు. అయినప్పటికీ టాలీవుడ్ లో ఆ 'వర్గం' అస్సలు తగ్గట్లేదు. ఎన్టీఆర్ కు ఇదే అసలైన నివాళి అంటూ డప్పు స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివక్ష.. ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర సినిమాల రాకతో స్పష్టంగా బయటపడింది.
ఈ జాడ్యం నుంచి ఎప్పుడు బయటకొస్తారో టాలీవుడ్ అప్పుడు బాగుపడుతుంది. కంటెండ్ బాగున్న చిత్రాన్ని మెచ్చుకోవడం ఎంత అవసరమో, చెత్త సినిమాలకు డప్పుకొట్టడం మానుకోవడం కూడా అంతే అవసరం. ఇది గుర్తించాలి.