మొన్న యువ నటుడు ఉదయ్‌కిరణ్.. ఇప్పుడు సంగీత దర్శకుడు శ్రీ.. ఒత్తిడిని అధిగమించలేక అర్ధాంతరంగా తనువు చాలించారు. ఒకరిది బలవన్మరణం.. ఇంకొకరిది కోరి తెచ్చుకున్న మరణం. ఏదైతేనేం, అర్థాంతరంగా రెండు సినీ తారలు మృత్యువాత పడటం సగటు సినీ అభిమానిని కలచివేసింది. జననం, మరణం.. దైవ నిర్ణయాలే కావొచ్చుగాక. కానీ, మానవ తప్పిదాలూ మరణాలకు కారణమవుతోంటే, అక్కున చేర్చుకోవాల్సిన సినీ కళామతల్లి తగిన సమయంలో ఆదుకోకపోవడంతో అకాల మృత్యువు సినీ రంగాన్ని కాటేస్తోంది.
సినిమా అవకాశాలు తగ్గి, ఆ ఒత్తిడికి తలొగ్గి ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఒత్తిడితో శ్రీ మరణించాడు. తల్లి మరణానంతరం శ్రీ కుంగిపోయాడట. సినీ రంగమంతా ఒకటే కుటుంబం అని వేదికలెక్కి ప్రసంగిస్తుంటారు. ‘నా ప్రాణ స్నేహితుడు..’ అని ఇంటర్వ్యూల్లో చెబుతారు చాలామంది సినీ జనం. కానీ, ఓ వ్యక్తి అవకాశాల్లేక కెరీర్‌లో నీరసించిపోయినా, వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నా.. వారినసలు లెక్కల్లోకి కూడా తీసుకోరు ఇదే సినీ జనం.
మహా నటి సావిత్రికే తప్పలేదు ఇలాంటి ఇబ్బంది. అప్పట్లో కొద్దోగొప్పో విలువలు అనేవి వుండేవి. విలువల్లేని ఈ రోజుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. కోట్లలో పారితోషికాలు వస్తున్నా, వాటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి కొందరిది. అందరూ మనోళ్ళే.. అంటూ విలాసాలకు అలవాటుపడ్డం సినీ రంగంలో చాలా కామన్. అదే చాలామందిని కాటేస్తుంది. విలాసాలు కొంత, నమ్మి ఆర్థికంగా స్నేహితుల్ని ఆదుకుని నాశనమైపోయినోళ్ళు ఎంతోమంది కన్పిస్తారు.
చెప్పుకుంటూ పోతే, వందేళ్ళ సినీ చరిత్రలో వందల కొద్దీ ఇలాంటి కథలు కన్పిస్తాయి. కానీ, ఏ కథ నుంచీ సినీ రంగం గుణపాఠం నేర్చుకోదు. తమ కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయామన్న ఆవేదన సినీ రంగం ప్రముఖుల్లో ‘అంత్యక్రియల రోజు’ మాత్రమే కన్పిస్తుంది, ఆ తర్వాత షరామామూలే. ఆదుకోవాల్సిన టైమ్‌లో ఎవరో ఒకరు పెద్దన్నలా ఆదుకుంటే, సగానికి పైగా అకాల మరణాలు నిలవురించబడ్తాయి. కానీ, అంత మానవీయ కోణం సినీ పరిశ్రమలో వుందా.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.