పత్రిక నడిపేవారికి, సంపాదకత్వం వహించేవారికి కేసులనేవి వృత్తిపరమైన ఆపదలు (అక్యుపేషనల్ హజార్డ్‌స్) ఎవరో ఒకరు ఏదో ఒక దానికై కేసు వేయకమానరు. కోపమో, ఉక్రోషమో, ప్రచారప్రీతో ఏదో ఒకటి మనసులో పెట్టుకుని ఓ కేసు తగిలిస్తారు. అప్పణ్నుంచి ఎడిటరు తన పనులు మానుకుని ఆ వూరికి వెళ్లి రావలసి వస్తూ వుంటుంది. డెబెనేర్ నడిపే రోజుల్లో అశ్లీలచిత్రం ముద్రించారు కాబట్టి తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఏదో ఒక చిన్న పట్టణంలో కేసు పెట్టేవారు. చచ్చినట్లు వెళ్లాల్సి వచ్చేది. తన ఆత్మకథలో వినోద్ రాసుకున్నాడు – ''నాపై చాలా కేసులు నడిచాయి. ఎన్నో లెక్క మర్చిపోయాను. ఇంకా ఐదారు పెండింగులో వున్నాయి. నా ఉద్దేశంలో ఎడిటరు యిలాటి వాటిల్లో ప్రతిష్టకు పోయి కేసును సాగదీయకూడదు. అవతలి పార్టీ ఏదైనా రాజీ ప్రతిపాదన చేస్తే మా కథనం కరక్టని చెపుతూనే, వాడిన పదాల్లో అభ్యంతరకరమైనవి వుంటే తీసేస్తామని చెప్పి కేసు వదిలించుకోవాలి. లేకపోతే మన టైమంతా వీటిపై వేస్టు అవుతుంది.''
ఔట్‌లుక్ దినదినం వృద్ధి చెందడం చూసి ''ఇండియా టుడే'' 1997 జూన్ నుంచి పక్షపత్రిక నుంచి వారపత్రికగా మారింది. అది ఔట్‌లుక్‌కు నైతిక విజయాన్నిచ్చింది. 20 నెలల్లో దాని చందాదారుల సంఖ్య లక్షకు చేరింది. 1998 మే దాకా ఔట్‌లుక్ ఏ యిబ్బందులూ లేకుండా ముందుకు సాగింది. సడన్‌గా వినోద్ మెహతాపై పాఠకులంతా విరుచుకుపడ్డారు. దానికి కారణం అతను వాజపేయి ప్రభుత్వం చేపట్టిన పోఖ్రాన్2 పేలుళ్లను వ్యతిరేకించడం.
వాజపేయి తొలిసారి ప్రభుత్వం 13 రోజులకే పడిపోయింది. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన 50 రోజులకే పోఖ్రాన్ బాంబు పేల్చింది. అర్బన్ మిడిల్ క్లాస్ ఆ బాంబు ప్రయోగంతో థ్రిల్లయి పోయింది. సుష్మా స్వరాజ్ ''అది అణు విస్ఫోటం కాదు, జాతీయతా విస్ఫోటం'' అంది. దేశప్రజలందరూ ఏదో సాధించినట్లు మురిసిపోయారు. ప్రభుత్వం చేసిన ప్రతీ పనీని విమర్శించే ప్రతిపక్షాలు కూడా దీన్ని తప్పుపట్టడానికి జంకాయి – జాతి వ్యతిరేక ముద్ర పడుతుందన్న భయంతో! లెఫ్ట్ పార్టీలు కూడా బాగా ఆలోచించి, ..చించి 'సైంటిస్టులను అభినందిస్తూనే బిజెపి సంకీర్ణ ప్రభుత్వం యీ ఉపఖండంలో ఆయుధాల పోటీని పెంచడాన్ని ఖండిస్తున్నాం' అని స్టేటుమెంటు యిచ్చారు. ఘనతంతా బిజెపికి పోవడం చూసి కాంగ్రెసు పార్టీ 'అణు పరిశోధన ప్రారంభించడంలో, ప్రోత్సహించడంలో కాంగ్రెసు పాత్ర గణనీయమైనది' అని చెప్పుకుంది. ఇదంతా చూసి వినోద్ మెహతా తన కాలమ్‌లో 'హౌ ఏ టైర్డ్ పిఎం బికేమ్ ఓ బోల్డ్ పిఎం' అనే హెడింగ్‌తో ''జనాభాలో 44% మందికి రోజువారీ ఆదాయం రూ.50 కూడా లేని దేశానికి యిది అవసరమా? భారత రక్షణ వ్యవస్థకు యిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ప్రమాదం అంటూ వుంటే గింటే వాజపేయి ప్రధాని పదవికి వుంది.'' అని వ్యాసం రాశాడు. అదీ పాఠకులకు కోపం తెప్పించిన కారణం.
ఆధునిక యుగంలో యుద్ధాలు కానీ, అణుపరీక్షలు కానీ యివన్నీ ప్రభుత్వాధినేత బలహీనపడినప్పుడు చేపట్టే కార్యక్రమాలు. వాటి ద్వారా జాతీయాభిమానాన్ని రెచ్చగొడతారు కాబట్టి దేశమంతా ఒక్క తాటిపై నిలిచి అతన్ని అభినందించవలసి వస్తుంది, కనీసం విమర్శించకుండా నోరు మూసుకోవలసి వస్తుంది. ప్రజల దృష్టి రోజువారీ సమస్యల నుండి తప్పుకుని మనం ఏదో సాధించాం అనే భావనపై పడుతుంది. పాకిస్తాన్‌లో ఎప్పుడూ సమస్యలే. అందువలన వాళ్లు నిరంతరం కశ్మీర్ గురించి, ఇండియాకు బుద్ధిచెప్పడం గురించి మాట్లాడుతూంటారు. 1962 చైనా ఇండియాపై ఎందుకు యుద్ధం ప్రకటించిందో, గెలుస్తూ కూడా తనంతట తానే ఎందుకు వెనక్కు తగ్గిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ సమయంలో మావోకు పార్టీలో ప్రతికూలత చాలా వచ్చిందని, దాన్ని అధిగమించడానికి ఇండియాపై దండెత్తాడని యిప్పుడు బయటకు వచ్చింది.
అణుపరీక్షలనేవి యితర పరిశోధనల లాటివి కావు. అంతర్జాతీయ సమాజం వాటిని గర్హిస్తుంది. అణ్వాయుధాలు తమ వద్ద వున్నా ఫర్వాలేదని, కానీ యిరుగుపొరుగుతో కలహాలున్న దేశాలు వీటిని తయారుచేయకుండా పర్యవేక్షించాలని అగ్రరాజ్యాలు భావిస్తాయి. ఏదైనా చిన్న కారణానికే అవి వాటిని ప్రయోగిస్తే మానవజాతి మనుగడకే ప్రమాదమని వాటి భయం. మీకున్నపాటి వివేకం మాకుండదా అని అభివృద్ధి చెందుతున్న దేశాలు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే అవి అగ్రరాజ్యాల ఆర్థికసహాయంతో మనుగడ సాగిస్తూ వుంటాయి. ఆంక్షలు విధిస్తే విలవిల్లాడతాయి. భారతదేశంలో ఇందిరా గాంధీ చైనా బూచి చూపి అణ్వాయుధాల ప్రయోగాలను ప్రోత్సహించింది. దేశంలో తన పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నపుడు అణుబాంబు ప్రయోగం చేయడానికి 1974 మేలో అనుమతి యిచ్చింది. అప్పుడు గుజరాత్‌లో విద్యార్థుల నవ నిర్మాణ్ ఉద్యమం సాగింది. ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో దేశమంతా రైల్వే ఉద్యోగుల సమ్మె జరిగింది. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రతిపక్షాలను ఏకం చేసింది. ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఇందిర ''స్మైలింగ్ బుద్ధా'' పేర పోఖ్రాన్‌లో అణుబాంబు ప్రయోగం జరిపించింది. దానివలన భారతీయులు గర్వంగా ఫీలయి వూరుకున్నారు కానీ ప్రపంచంలో అణుసంపద వున్న దేశాలన్నీ మన దేశంపై ఆంక్షలు విధించాయి. అన్ని రకాల అణు పరిశోధనలు కుంటుపడ్డాయి. స్వదేశంలో మనకు సాధనసంపత్తి లేదు. విదేశం నుంచి టెక్నాలజీ కానీ, ముడిసరుకు కానీ అందలేదు. ఎంతో నష్టపోయాం.
భారతీయ సైంటిస్టులు ఎలాగోలా తంటాలు పడుతూ వచ్చి 1989 నుంచి పృథ్వీ సీరీస్ మిస్సయిల్ కార్యక్రమాలు ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా మరో అణుబాంబు ప్రయోగం చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వచ్చింది, 1995లో ప్రధానిగా వున్న పివి నరసింహారావుగారికి. అయిన పాలించిన ఐదేళ్లూ రాజకీయ అస్థిరత వుందని మనం మర్చిపోకూడదు. పోఖ్రాన్‌లోనే మరో పరీక్ష చేయించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. అమెరికన్ శాటిలైట్లు యీ ఏర్పాట్లను పసిగట్టాయి. అమెరికాలో వున్న బిల్ క్లింటన్ ప్రభుత్వం తక్షణం పరీక్షను ఆపించమని, లేకపోతే ఇండియాపై కఠినమైన ఆంక్షలు విధించవలసి వస్తుందని హెచ్చరించిది. పివి ఆపేశారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)