బాహుబలి-2 విజయం చూసిన తర్వాత చిరంజీవి మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు, సినిమా కాస్త ఆలస్యమైనా ఏం కాదు.. సినిమా మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.
అందుకే గడిచిన నెల రోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు రూపురేఖలే మారిపోతున్నాయి. హేమాహేమీల్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నడుస్తున్న పుకార్ల ప్రకారం, ఉయ్యాలవాడ ప్రాజెక్టు కోసం ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారట. చారిత్రక కథలు, దేశభక్తి సినిమాలకు రెహ్మాన్ సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే చూశాం.
పైగా ఉయ్యాలవాడకు జాతీయ స్థాయిలో క్రేజ్ రావాలంటే రెహ్మాన్ ఉండాల్సిందే. ప్రస్తుతం యూనిట్ అదే పనిలో ఉన్నట్టుంది.
మరోవైపు హీరోయిన్ గా మొన్నటివరకు టాలీవుడ్ బ్యూటీస్ పేర్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అనుష్క పేరును దాదాపు ఫైనల్ చేసినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తున్నారు.
ఇక ఉయ్యాలవాడ ప్రాజెక్టు గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించారు. అదిరిపోయే గ్రాఫిక్స్ తో అదరగొట్టిన బాహుబలి ప్రాజెక్టు వెనక ఉన్నది ఇతడే.
ఇలా ఉయ్యాలవాడ ప్రాజెక్టుకు సంబంధించి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందర్నీ తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా మార్కెట్ పెరగడంతో పాటు సినిమా క్వాలిటీ కూడా బాగుంటుందని యూనిట్ భావిస్తోంది.