ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న భూ కుంభకోణాలు, ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపద్యంలో ఉభయ ప్రభుత్వాలు వీలయినంత నికార్సుగా వ్యవహారించాలని అనుకోవడం వంటివి టాలీవుడ్ జనాలను కూడా కలవరపెడుతున్నాయి.
ఎందుకంటే సినిమా జనాలు ఎక్కువగా ఇన్ వాల్వ్ అయ్యేది రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనే. వారి నల్ల ధనం అంతా పెట్టుబడి పెట్టేది రియల్ ఎస్టేట్ లోనే.
గతంలో తెలుగు సినిమా నిర్మాతలు ఒకరిద్దరు, అలాగే దర్శకులు ఒకరిద్దరు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కాస్త డిస్ప్యూట్ ప్రాపర్టీల్లో పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెట్టుబడి పెట్టిన నిర్మాతల్లో ఒకరు ఇఫ్పుడు సినిమాలు తీయడం లేదు. ఇంకొకరు అప్పుడప్పుడు తీస్తుంటారని తెలుస్తోంది.
ఇలా సినిమా జనాలు పెట్టుబడి పెట్టిన వాటిల్లో హైదరాబాద్ శివారు భూములు, విశాఖ మధురవాడ ఏరియా భూములు వున్నాయని వినికిడి. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం తీగలు లాగుతోంది.
ఆంధ్రలో అయితే ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందమే ఏర్పాటు చేసారు. దీంతో ఇప్పుడు ఈ నిర్మాతలు, ఇతరుల్లో కలవరం కలుగుతోందని టాక్.
తాము కొన్న భూములు ఈ కేటగిరీలో వున్నాయా? తమ దగ్గర వున్న రికార్డులు సరైనవేనా అని వాళ్లలో వాళ్లు తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే వివాదంలో లేదా కొనరాని భూములు కొని, అధికారులను, రాజకీయ నాయకులను పట్టుకుని సెట్ రైట్ చేసుకున్న వారు కూడా ఇప్పుడు అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది.