త్రివిక్రమ్ ను నొక్కిపెడుతున్న పవన్?

త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ వున్న దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా చేస్తా అనాలే కానీ, క్యూలో వుంటారు నిర్మాతలు. మేం రెడీ అంటారు హీరోలు. నష్టమో, లాభమో అన్న సంగతి…

త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ వున్న దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా చేస్తా అనాలే కానీ, క్యూలో వుంటారు నిర్మాతలు. మేం రెడీ అంటారు హీరోలు. నష్టమో, లాభమో అన్న సంగతి పక్కన పెడితే, నితిన్ లాంటి మిడిల్ రేంజ్ హీరోతో 42కోట్ల మేరకు ఆదాయం సాధించే సినిమా తీసి చూపించాడు అంటే అది త్రివిక్రమ్ ఘనతే. అ..ఆ సినిమా తరవాత త్రివిక్రమ్ ను లాక్ చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనంటే వున్న అభిమానంతో త్రివిక్రమ్ కూడా లాక్ అయిపోయాడు. త్రివిక్రమ్ తో సినిమాల కోసమే బ్యానర్ పెట్టిన నిర్మాత రాధాకృష్ణ కూడా అంతగా ఇష్టం లేకున్నా ఊ అనక తప్పలేదు.

అంతా బాగానే వుంది కానీ పవన్ వర్కింగ్ స్టయిల్ వల్ల ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. దీనికి ముందుగా పవన్ చేయాల్సిన సినిమానే ఇంతవరకు అతీ గతీ లేకుండా వుంది. అది పూర్తి కావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. మరి ఈ ఆరు నెలలు త్రివిక్రమ్ అలాగే ఖాళీగా వుండాల్సిందేనా?  ఆ ఆరు నెలల్లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తే కనీసం 10 నుంచి 12 కోట్లు ఆదాయం వస్తుంది. అదంతా లాసేనా? మరి?

దీంతో మరి కొందరు నిర్మాతలు త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లడం ప్రారంభించారు. ఈ గ్యాప్ లో మాకు ఓ సినిమా చేసేసి, 12 కోట్లు తీసేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.  త్రివిక్రమ్ ఎటూ తేల్చకోలేని డైలామాలో వున్నాడు. ఇది తెలిసి పవన్ మళ్లీ త్రివిక్రమ్ కు బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి రెండు సినిమాలు సమాంతరంగా చేసేద్దాం, మరో పని పెట్టుకోవద్దు అని త్రివిక్రమ్ కు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఎంతవరకు అది సాధ్యమో అన్నదే అనుమానం. త్రివిక్రమ్ స్కూలు, దాని కాస్టింగ్, ఆ వ్యవహారాలు వేరు.

పవన్ కొత్త ఎత్తు?

త్రివిక్రమ్ ఇలా ఊగిసలాడుతున్న సంగతి తెలిసి, పవన్ మరో ఎత్తు వేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా సినిమా చేయాలనే డిసైడ్ అయితే రామ్ చరణ్ కు చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. తను చెప్పడమే కాకుండా, చరణ్ తరపున ఓ వ్యక్తిని రాయబారం కూడా పంపించినట్లు వినిపిస్తోంది. చరణ్ ఈ నెలాఖరు వరకు ధృవ షూట్ పై వుంటారు. ఆ తరువాత మైత్రీ-సుకుమార్ సినిమా చేయాలి. అవసరం అయితే కాస్త టైమ్ తీసుకునేందుకు మైత్రీ నిర్మాతలు సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. సో, తాను సినిమాకు రెడీ అని రామ్ చరణ్ కబురు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా అన్ని వైపుల నుంచి వస్తున్న వత్తిడికి ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక త్రివిక్రమ్ కిందా మీదా అవుతున్నట్లు వినికిడి.