cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్‌– రైటర్స్‌ బ్లాక్‌!

త్రివిక్రమ్‌– రైటర్స్‌ బ్లాక్‌!

ఎంత గొప్ప రచయితకైనా ఒకదశలో అక్షరానికి అనేక అడ్డంకులు వస్తాయి. రైటర్స్‌ బ్లాక్‌ అనండి.. సృజనాత్మకత తగ్గిపోవటమనండి.. మారుతున్న వర్తమానాన్ని ఒడిసి పట్టుకోలేకపోవటమనండి.. ఏ పేరు పెట్టుకున్నా ఆ సమయంలో అంబపలకదు. చలం నుంచి రావిశాస్త్రీ, బీనాదేవిల దాకా అందరూ ఈ స్థితిని అనుభవించినవారే. ఇలాంటి రచనలు చూసి– వారి అభిమానులు ‘ఒకప్పుడు అద్భుతాలు చూపించిన వీరేనా ఇలా అయింది...’ అనుకుంటారు.

మనకున్న గొప్ప కథకులలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒకరు. కథ, కథనం, డైలాగులు ఈ మూడింటినీ తన భుజం మీద వేసుకొని నడిపించగలిగిన శక్తున్న దర్శకుల్లో ఆయన ఒకడు. రెండు లైన్ల కథను తన కోణంలో విస్తృతపరచగలిగిన సామర్థ్యమున్నవాడు. అలాంటి త్రివిక్రమ్‌ సినిమాలు ఎందుకు ప్లాప్‌ అవుతున్నాయి? కథలో కొత్తదనం లేక?.. కథనం సరిగ్గా చెప్పలేకపోవటం వల్లా? లేకపోతే హీరోల ఇమేజ్‌ల బరువులో కూరుకుపోయి రకరకాలుగా సర్దుకుపోవటం వల్లా?

ఈ ప్రశ్న వేసుకొని ఆలోచించే వారికి– ‘అరవింద సమేత వీరరాఘవ’ చూస్తే ఒక స్పష్టత వస్తుంది. త్రివిక్రమ్‌ కూడా రైటర్స్‌ బ్లాక్‌లో చిక్కుకున్నాడేమో అనిపిస్తుంది. ముందుగా ఈ సినిమా గురించి రెండు మాటలు చెప్పుకుందాం. రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి మోహన్‌బాబు దగ్గర నుంచి రామగోపాల వర్శ దాకా అందరూ తమ కోణంలో చెప్పేశారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్‌ వంతు. అందువల్ల కథ కొత్తది కాదు. కక్షల వల్ల కాటికి వెళ్లిన వారి పిల్లల పరిస్థితి ఏమిటి?

వారు ఈ ఫ్యాక్షనిజం బాటన పట్టకుండా చూడకుండా పరిష్కారమార్గమేదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి దర్శకుడు ఈ సినిమాలో ప్రయత్నిస్తాడు. దీనికి అనుగుణంగానే కథ ప్రారంభం అవుతుంది. కథ ముందుకు కదులుతున్న కొలది– త్రివిక్రమ్‌ మనసులో ఉన్న అనేక అస్పష్టతలు, సందిగ్దాలు, వైరుద్ధ్యాలు మనకు తెరపైన కనిపిస్తాయి. భౌతిక హింసను ఒక ఆలోచన ద్వారా తుదముట్టించాలనే సంకల్పంతో ఉన్నట్లు మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

కానీ హీరోయిన్‌ను కలిసి స్ఫూర్తి పొందేదాకా అతనికి ఏం చేయాలో తెలియదు. అందువల్ల కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేని స్థితిలో ప్రేక్షకుడు ఉంటాడు. అలాగని అనూహ్యమైన మలుపులు ఏమి లేవనే విషయం తెలిసిన తర్వాత నిరాశ కలుగుతుంది. ఈ సినిమా డాక్యుమెంటరీలా ఉందనే కొందరు వ్యాఖ్యానించటానికి కారణం ఇదేకావచ్చు. ఈ సినిమా మొత్తంలో మనను ఆకర్షించేది సంగీతం. ముఖ్యంగా తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ భిన్నంగా ఉందని చెప్పవచ్చు.

అతడు, అత్తారింటికి దారేది వంటి త్రివిక్రమ్‌ సినిమాలతో పోలిస్తే ఎడిటింగ్‌ అంత ప్రత్యేకంగా అనిపించవచ్చు. ప్రతి ఫ్రేమ్‌లోను ఎన్టీఆర్‌ను చూపించాలనే దర్శకుడి తపన కనిపిస్తుంది. కథంతా హీరో ద్వారానే నడవాలనే ఆలోచన వల్ల దర్శకుడు ముందరి కాళ్లకు బంధం వేసేసుకున్నాడు. సినిమా గురించి చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌ దగ్గరకు వద్దాం. వరసగా ఆయన సినిమాలు ఎందుకు ప్రేక్షకులకు నిరాశ మిగిలిస్తున్నాయి? అనే విషయాన్ని విశ్లేషించుకుందాం.

త్రివిక్రమ్‌ మన పూర్వ నాటికా సంప్రదాయం నుంచి వచ్చినవాడు. దాని ద్వారా ప్రేరేపితుడయినవాడు. ఆ సంప్రదాయంలో రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సీన్ల రూపంలో అమరుస్తాడు. తర్వాత ఏం జరగబోతోందనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పకనే చెబుతూ ఉంటాడు. ఈ సూచనల వల్ల ప్రేక్షకుడికి తర్వాత సీన్‌లో ఏం జరగబోతోందనే విషయం అన్యాపదేశంగా తెలుస్తూ ఉంటుంది. ఈ పద్ధతిలో ప్రేక్షకుడు–రచయిత–నటీనటులు కలిసి ప్రయాణిస్తూ ఉంటారు.

ఇలా కాకుండా ప్రేక్షకులకు ఏమి తెలియనివ్వకుండా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు పెట్టి ఘాట్‌ రోడ్డు మీద కారు నడిపినట్లు నడపటం వేరే పద్ధతి. ఇవి కాకుండా ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న సమస్య అంతా ఇక్కడే ఉంది. ఒక పూర్వ సంప్రదాయంలో కథను ప్రారంభించి.. దానిని అలా నడపకుండా వేరే పద్ధతిలోకి తీసుకువెళ్లటం వల్ల ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయనే విషయం ప్రేక్షకులకు తెలియదు.

శత్రువుల తలలను కూర ముక్కల్లా తరిగేయగలిన కౌర్యం ఉన్న హీరో– హీరోయిన్‌ మాటల్లో అంతర్లీనంగా ఉన్న అర్థాన్ని ఎలా గ్రహించగలడో తెలియదు. హీరో అరగంట ఆలస్యంగా వస్తే బ్రేకప్‌ చెప్పేయటానికి సిద్ధమయిన హీరోయిన్‌– కక్షలతో అట్టుడికి పోతున్న ప్రాంతాలకు వెళ్లే సాహసం (చదువులో భాగంగా అని చెప్పే రీజన్‌ లాజికల్‌గా లేదు) ఎందుకు చేస్తుందో తెలియదు.

రెండు ప్రత్యర్థ పార్టీలు– ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ఎందుకు కలిసిపోతాయో తెలియదు.. ఇలా వేసుకుంటూ పోతే ప్రశ్నలెన్నో. మూడు గంటలు నిడివి ఎక్కువే అయినా– మొత్తంమీద ఒకసారి చూడదగ్గ సినిమా ఇది.

–భావన
(fbackfm@gmail.com)