దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట అంటే ఆయనతో సాన్నిహిత్యం వున్నవారికి లక్ష్మణ రేఖ తో సమానం. దాటే ప్రసక్తే లేదు. హారిక హాసిని సంస్థలో త్రివిక్రమ్ మాట జవదాటడం, ఆయన నిర్ణయాన్ని క్వశ్చను చేయడం అనేదే వుండదు. అ..ఆ సినిమా నిర్మాణం విషయంలో అది అనేక సార్లు రుజువయింది. పైగా అదే సంస్థ నిర్మించిన ప్రేమమ్ సినిమా విషయంలో కూడా పరోక్షంగా త్రివిక్రమ్ జోక్యం చాలా వుందన్నది ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
ఇప్పుడు మరో సినిమా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. రచయిత కృష్ణ చైతన్య చాలా అంటే చాలా కాలంగా హీరో నితిన్ తోనే వుంటున్నాడు. రౌడీ ఫెలో సినిమా తరువాత ఎలాగైనా నితిన్ తోనే సినిమాచేయాలని అలా పట్టు వీడకుండా, అతనితోనే వుంటూ వచ్చాడు. ఇప్పటికి మెటీరియలైజ్ అయింది. ఇది కూడా సింపుల్ ప్రేమ కథే. కృష్ణ చైతన్య తయారుచేసుకున్న కథకు కొన్ని మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేయడంతో మూల కథ అంటూ కొత్తగా మరో పేరు తోడయినట్లు తెలుస్తోంది.
సరే ఆ విషయం అలా వుంచితే, నితిన్ సినిమాకు డైరక్టర్ కమ్ కెప్టెన్ కృష్ణ చైతన్యే కదా? కానీ నిర్ణయాలు మాత్రం త్రివిక్రమ్ వే అని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా నటరాజ సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేసారు. అది త్రివిక్రమ్ ఛాయిస్ అని క్లియర్ అయిపోతోంది. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్, ఆర్ట్ డైరక్టర్ ఎవరు అన్నది కూడా త్రివిక్రమ్ కోర్టులోనే వదిలేసారట. ఆయన ఎవరు అంటే వాళ్లే ఫైనల్. వాళ్లతో పని చేయించుకోవడం మాత్రమే కృష్ణ చైతన్యకు మిగిలింది.
మళ్లీ మిక్కీ జె మేయర్ కు, ప్రకాష్ కు అవకాశం ఇస్తారేమో త్రివిక్రమ్ చూడాలి.