తొలి ఓవర్లోనే వికెట్ పడితే.. వామ్మో ఇదేంటి! అనుకున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్. తొలి టెస్టు డ్రా అయినా ఇంగ్లండే పై చేయి సాధించినట్టుగా అనిపించడం.. తొలి ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ వికెట్ తీయడంతో ప్రేక్షకులు ఊసురుమన్నారు. అందులోంచి కోలుకోకుండానే రెండో వికెట్ కూడా పడిపోయింది. ఐదో ఓవర్లో మురళీ విజయ్ వెనుదిరిగాడు. దీంతో భారత శిబిరంలో నిరాశ నెలకొంది. ఇంగ్లండ్ బౌలర్లు ముంచేసేలా ఉన్నారనిపించింది.
అయితే.. ఆ తర్వాత కథ మారింది! కెప్టెన్ విరాట్ కొహ్లీ, డిపెండబుల్ పూజారాలు కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 22 పరుగులకే రెండు వికెట్లు పడిన దశ నుంచి లంచ్ వరకూ ఇన్నింగ్స్ ను స్టడీగా నిలబెట్టారు. వికెట్లు నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలో ఓవర్ కు సగటును మూడు పరుగులకు మించి రాలేదు.
లంచ్ విరామానంతరం మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. వేగం పెరిగింది. ఓవర్ కు మూడు పరుగుల దశ నుంచి బౌండరీల వర్షంతో.. వన్డే తరహా గేమ్ ఆడారు విరాట్ , పూజారాలు. పోటీలు పడి పరుగులు చేశారు. ఒకరిది హాఫ్ సెంచరీ పూర్తి అయితే ఆ వెంటనే మరొకరిది. ఒకరు 60 పరుగుల మార్కును చేరితే.. మరొకరు ఆ వెంటనే అనుసరించారు. ఇలా ఇద్దరూ పోటీ పడుతూ.. దాదాపు ఒకేసారి 90 పరుగల మార్కును రీచ్ అయ్యారు. ఈ క్రమంలో పూజారా ముందుగా సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల వద్ద సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల వద్ద డబుల్ తీయడంతో కొహ్లీ 154 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
రెండో సెషన్ లో దాదాపు 28.2 ఓవర్లు పడగా.. 118 పరుగులు వచ్చాయి. రన్ రేట్ నాలుగుకు పైనే నడిచింది. తొలి మ్యాచ్ తో పోలిస్తే.. భారత బ్యాటింగ్ వేగం చాలా వరకూ పెరిగిందని ఈ గణాంకాలతో స్పష్టం అవుతోంది. రాజ్ కోట్ టెస్టులో ఇండియా రన్ రేట్ ఆసాంతం మూడు స్థాయిలోనే కొనసాగింది. ఈ మ్యాచ్ లో మాత్రం ఆ పరిస్థితి మెరుగైంది!
ఇంగ్లండ్ పేసర్లు.. ఆదిలో భయపెట్టినా, ఆ తర్వాత మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు. బ్రిటీష్ స్పిన్ బలగాన్ని కూడా విరాట్, పూజారాలు ధాటిగా ఎదుర్కొన్నారు.