టీవీ 9 అమ్మకం చెల్లదా?

చిరకాలంగా వార్తల్లో వుంటూ, ఇటీవలే అమ్మకం పూర్తి చేసుకున్న టీవీ 9 వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సంస్థ అమ్మకంలో తమకు పాత్ర లేకుండా చేసారని, ఈ లావాదేవీ నిలిపివేయాలని కోరుతూ మారిషస్…

చిరకాలంగా వార్తల్లో వుంటూ, ఇటీవలే అమ్మకం పూర్తి చేసుకున్న టీవీ 9 వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సంస్థ అమ్మకంలో తమకు పాత్ర లేకుండా చేసారని, ఈ లావాదేవీ నిలిపివేయాలని కోరుతూ మారిషస్ కు చెందిన ఓ పెట్టుబడుల సంస్థ జాతీయ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ సంస్ధ పరోక్ష పెట్టుబడులు టీవీ 9  పేరెంటల్ కంపెనీ ఎబిసిఎల్ లో వున్నాయి. ఈ మొత్తం వ్వవహారం ఇలా వుంది.

టీవీ 9 పేరెంటెల్ కంపెనీ ఎబిసిఎల్ లో మెజారిటీ వాటాదారు అయిన శ్రీనురాజుకు ముందుగా ఐ విజన్ మీడియా ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ వుండేది. ఈ సంస్థలో మారిషస్ కు చెందిన సైఫ్ అనే పెట్టుబడులు సంస్థ 80కోట్లు 2008 లో పెట్టుబడి పెట్టింది. అప్పట్లో ఇది ఐవిజన్ పెట్టుబడుల్లో 80 శాతం కింద లెక్క. వివిధ మీడియా మాధ్యమాల్లో పెట్టుబడికి ఉద్దేశించి ఐవిజన్ సంస్థను అప్పట్లో ఏర్పాటు చేసారు.

ఆ తరువాత ఎబిసిఎల్ ఏర్పాటు చేసి, ఈ ఐ విజన్ పెట్టుబడులు అందులోకి మళ్లించారన్నది సైఫ్ సంస్థ అభియోగం. తరువాత ఏకంగా ఐవిజన్ ను ఎబిసిఎల్ లో విలీనం చేసి, సైఫ్ సంస్థకు14.29శాతం వాటా ఫిక్స్ చేసారట. ఇదంతా తమ సమ్మతి లేకుండా, ఏకపక్షంగా చేసేసారని సైఫ్ ఇప్పుడు ఆరోపిస్తోంది. ఈ విషయంలో శ్రీనురాజుకు, సైఫ్ కు మధ్య అపరిష్కృత వివాదం వుంది.

ఇది ఇలా అపరిష్కృతంగా వుండగానే, ఇప్పుడు ఎబిసిఎల్ లో వాటాను వేరే సంస్థలకు అమ్మేయడం చెల్లదంటొంది సైఫ్ పెట్టుబడుల సంస్థ. పైగా ఈ అమ్మకం గురించి తమకు మాట మాత్రం కూడా చెప్పలేందంటోంది. అందువల్ల ఆ లావాదేవీలను, షేర్ల బదిలీలను నిలిపివేయాలని కోరుతూ లా ట్రిబ్యునల్ ను కోరారు.

ఈ పిటిషన్, ఇదే వ్యవహారంపై దాఖలైన రెండు అనుబంధ ఫిటిషన్లు కలిపి నవంబర్ 12న విచారణకు వస్తాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద శ్రీనురాజు వాదన వేరుగా వుంది. తాము మొత్తం వ్యవహారాన్ని రిజర్వ్ బ్యాంక్ కు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కు చెప్పే చేసామని అంటున్నారు.

ఈ డీల్ పూర్తయితే, ఐవిజన్ లో వున్న అప్పులు తీర్చేస్తామని, ఐ విజన్ లో మారిషస్ సంస్థ పెట్టిన పెట్టుబడిని ఎప్పుడో, వడ్డీ లేని రుణంగా మార్చామని, అది తీర్చేస్తామని అంటున్నారు. ఇంతకీ లా ట్రిబ్యునల్ ఏమంటుందో చూడాలి?