టాలీవుడ్ పాలిట విలన్లు మరీ ఎక్కువ అవుతున్నారే!

ఒక దశలో వరస పెట్టి అంతా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిజాన్ని ప్రదర్శించడానికి తగిన ఫీచర్లు లేకపోయినా ఎవరు పడితే వాళ్లు సినిమాల్లో హీరోలుగా అవతారం ఎత్తారు. ఆర్థికంగా ఉన్న వాళ్ల కుటుంబాల నుంచి,…

ఒక దశలో వరస పెట్టి అంతా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిజాన్ని ప్రదర్శించడానికి తగిన ఫీచర్లు లేకపోయినా ఎవరు పడితే వాళ్లు సినిమాల్లో హీరోలుగా అవతారం ఎత్తారు. ఆర్థికంగా ఉన్న వాళ్ల కుటుంబాల నుంచి, సినీ వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి వారిలో కొందరు ఏదో అదృష్టం కొద్దీ ఒకటీ రెండు సినిమాలతో నిలదొక్కుకుని.. హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వారిలో నిలదొక్కుకోలేని వారి పరిస్థితే ఎటూ కాకుండా అయిపోయింది.

హీరోలుగా పనికి రాకుండా పోయిన వీళ్లు విలన్లుగా చేస్తామని ప్రకటనలు దంచుతున్నారు! అంటే.. హీరోగా  ఫెయిలయ్యాం కాబట్టి.. సెకెండ్ ఛాన్స్ కింద విలన్లుగా చేస్తారనమాట! ఇలా బేరాలు పెడుతున్న వాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. పదిపదిహేనేళ్ల కిందట హీరోలుగా వచ్చి ఇన్నేళ్లూ నిలదొక్కుకోవడంలోనే గడిపేసిన కొంతమంది విలన్ వేషాలు వేస్తామని పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. మరి వాళ్లే అనుకొంటే.. హీరోలుగా రిటైర్మెంట్ స్టేజీలో ఉన్న వారు, హీరోలుగా ఫేడవుట్ అయిన వాళ్లు కూడా విలన్ వేషాలు కావాలంటున్నారు.

వీళ్లు బోనస్ కింద విలన్ వేషాలు అడుగుతున్నట్టున్నారు. ఒకరిద్దరు మాజీ హీరోలు విలన్లుగా సక్సెస్ అయ్యే సరికి చాలా మంది విలన్ వేషాలపై తమ మక్కువను వెల్లడిస్తున్నారు. ఈ జాబితానూ పెద్దగానే ఉంది. హీరోలుగా సక్సెస్ కాలేకపోయిన ఒక అరడజను మంది, హీరోలుగా కెరీర్ ను ముగించుకున్న మరో అరడజను మంది 'విలన్లం' అవుతామని మక్కువ ప్రదర్శిస్తున్నారు. మరీ ఇంతమంది ఒకేసారి విలనిజం ప్రదర్శిస్తామంటే.. అన్ని బెర్తులు ఖాళీగా ఉండాలి కదా!