హైద్రాబాద్ డ్రగ్స్‌కి అడ్డాగా మారిపోయింది. విశ్వనగరం మాటేమోగానీ, హైద్రాబాద్‌ని డ్రగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. పైగా, డ్రగ్స్ మాఫియా విద్యా సంస్థల్లోకి సైతం చొచ్చుకుపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి ఇప్పటికే 13మందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అరెస్ట్ చేసిన విషయం విదితమే. మరోపక్క, సినీ పరిశ్రమపైనా 'డ్రగ్స్' ఆరోపణలు గట్టిగానే విన్పిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఎన్‌ఫోర్స్‌మెంట్ 'సిట్' నుంచి నోటీసులూ అందుకున్నారు.
నేడో రేపో మరిన్ని అరెస్టులు వుంటాయనీ, టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరో, ఓ ప్రముఖ దర్శకుడు, ఇంకో సినీ సెలబ్రిటీ అరెస్ట్ అవడం ఖాయమనీ ప్రచారం జరుగుతోంది. వాళ్ళెవరు.? అన్నదానిపై చూచాయిగా సంకేతాలు కన్పిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడితేనే అరెస్టులకు ఆస్కారం వుంటుంది. డ్రగ్స్‌కి సంబంధించిన ప్రత్యేకమైన అంశమిది.
ఇప్పటికే, కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించినా, అక్కడ డ్రగ్స్ దొరక్కపోవడం, అంతకు ముందే అక్కడున్న డ్రగ్స్‌ని వివిధ రూపాల్లో నాశనం చేసేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి ఈ కేసు ఓ సవాల్‌గా మారింది. గడచిన పది పదిహేను రోజులుగా డ్రగ్స్ విషయమై పెద్దయెత్తున జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, టాలీవుడ్‌కి చెందినవారైనా, కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందినవారైనా, ఒకవేళ డ్రగ్స్ ఆరోపణల్లో ఇరుక్కున్నా.. వారి దగ్గర్నుంచి డ్రగ్స్ రికవరీ చేసి, అరెస్ట్ చేసే పరిస్థితి వుండకపోవచ్చు.
సో, అరెస్టులు అంత తేలికైన వ్యవహారం కాదన్నమాట. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువ నటుడు అయితే, 'నాకు ఆ అలవాటు లేదు. ఈ కేసుతో సంబంధమే లేదు. ఒకవేళ వున్నవాళ్ళకైనా, ఏముంటుంది.. మహా అయితే కౌన్సిలింగ్ ఇస్తారు..' అంటూ నోరుజారేయడం చూస్తోంటే, ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని వాళ్ళెంత లైట్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
'ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది' అన్న ఆందోళన తప్ప, డ్రగ్స్ కేసులో సీరియస్‌నెస్‌ని చూడలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? అయితే, డ్రగ్స్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామంటున్న విచారణాధికారులు, ఇప్పటికే 13మందిని అరెస్ట్ చేసిన దరిమిలా, సో కాల్డ్ సెలబ్రిటీలు ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటే, అంతే సంగతులు.!