''హైద్రాబాద్ యువత మత్తులో జోగుతోంది.. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లోని విద్యార్థులు డ్రగ్స్‌కి బానిసలైపోయారు.. తెరవెనుకాల ఈ తతంగాన్ని నడిపిస్తోన్నది కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాలే..''
ఇలా మొదలైంది 'ఉడ్తా హైద్రాబాద్' వ్యవహారం. అనూహ్యంగా విషయం సినీ పరిశ్రమకు లింక్ అయ్యింది. అప్పటిదాకా, కార్పొరేట్ స్కూళ్ళకు, కాలేజీలకు నోటీసులు ఇచ్చిన ఎక్సయిజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఈసారి ఫోకస్ సినీ పరిశ్రమ మీద పెట్టారు. అంతకు ముందు వెలుగు చూసిన 'కార్పొరేట్ డ్రగ్ మాఫియా' వ్యవహారం ఏమయ్యిందో ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఇప్పుడంతా ఫోకస్ టాలీవుడ్ మీదనే కన్పిస్తోంది.
తెరవెనుకాల ఏం జరిగింది.? స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాసంస్థలకు 'సిట్' నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టాక, ఆ వ్యవహారమెందుకు సద్దుమణిగింది, సినీ పరిశ్రమ ఎందుకు వివాదాల్లోకి లాగబండింది.? నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత మినహా ఈ విషయమై పెద్దగా ఎవరూ పెదవి విప్పడంలేదు. మొత్తంగా సినీ పరిశ్రమకు 'ఉడ్తా టాలీవుడ్' అనే మకిలి అంటించేస్తున్నా, సోకాల్డ్ సినీ పెద్దలు, బయటకొచ్చి గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి.
'కొందరు వుండొచ్చు..' అంటూ ముందే చేతులెత్తేసిన సోకాల్డ్ ప్రముఖులు, ఆ తర్వాత వేలాది మంది సినీ జనం వున్న తెలుగు సినీ పరిశ్రమలో ఒకరిద్దరు వుంటే అది పాయింట్ నాట్ నాట్ వన్ శాతమే కావొచ్చు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల ఉపయోగమేంటి.? సుబ్బరాజు నోటీసులు అందుకున్నాడు. నవదీప్‌కి నోటీసులు అందాయి. దాదాపు 19 మంది వరకూ నోటీసులు అందుకున్నవారిలో వున్నారంటూ సినీ పరిశ్రమ గురించి ఎక్సయిజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెబుతోంది.
మరి, కార్పొరేట్ విద్యా రంగానికి సంబంధించి ఎంతమందికి నోటీసులు వెళ్ళాయి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసు 'సినీ మలుపు' తిరిగిన వెంటనే, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అకున్ సబర్వాల్ 'సెలవు' అన్నారు, విమర్శలొచ్చాక ఆ సెలవు రద్దు చేశారు. ఇదంతా చూస్తోంటే, ఉడ్తా హైద్రాబాద్‌ని కాస్తా డైల్యూట్ చేయడానికీ, కార్పొరేట్ విద్యా రంగ ప్రముఖుల్ని కాపాడేందుకే, తెలుగు సినీ పరిశ్రమని 'పెద్దలు' బలిపశువుని చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.