Advertisement


Home > Movies - Movie Gossip
మత్తులో కూడా కులాల గమ్మత్తు?

టాలీవుడ్ లో ఇప్పుడు మత్తు మందుల హడావుడి కనిపిస్తోంది. మీడియా జనాల మధ్య తప్ప ఇండస్ట్రీ జనాలు దీనిపై గట్టిగా పెదవి విప్పడం లేదు. కానీ మరోపక్క టాలీవుడ్ పెద్దల విషయంలో, వర్గాల విషయంలో అంతర్గతంగా అసంతృప్తి అల్లుకుంటోంది. అమ్మకు చిక్కిన మేకల్లా, ఎటు చెందని వారిని బలిచేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెరవెనుక ఘొల్లు మంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కీలకమైన రెండు వర్గాల వారిని ఈ మత్తు వ్యవహారం నుంచి తప్పించే వ్యవహారం దిగ్విజయంగా జరిగిపోతోందంటూ ఆరోపిస్తున్నారు.

టాలీవుడ్ లో రెండు వర్గాలు ఇప్పుడు కీలకం అన్న సంగతి తెలిసిందే. కమ్మ, కాపు అన్నది బహిరంగ రహస్యం. మత్తు మందు వ్యవహారాలు తెరపైకి రాగానే ఈ రెండు వర్గాలకు చెందిన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. చిత్రంగా, ఈ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. కానీ ప్రెస్ మీట్ పెట్టింది మా అసోసియేషన్ తరపున.

‘మా’తో ఏం పని?

మా సంఘంతో వీళ్లకు ఏం పని. అది నటీనటుల సంఘం. అందులో వీళ్ల మెంబర్లు కాదు. అయితే నిర్మాతల సంఘం తరపునో, డిస్ట్రిబ్యూటర్ల సంఘం తరపునో, లేదా ఇంకా కావాలంటే ఎగ్జిబిటర్ల తరపునే పెట్టి వుండాలి. అలా ఎందకు చేయలేదు? మా సంఘానికి వీళ్లకు ఏమిటి సంబంధం అని ప్రశ్నలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. పైగా ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్లో కొందరికి కూడా డ్రగ్స్ వ్యవహారాలతో ఇంతో అంతో సంబంధాలు వున్నయని టాలీవుడ్ లో గుసగుసలు వున్నాయి. అవి నిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ వాటిని కప్పిపుచ్చడానికే ఇలా అర్జెంట్ గా తెరముందుకు వచ్చారని టాలీవుడ్ లో కింది స్థాయి జనాలు కామెంట్ చేస్తున్నారు.

ఓ ప్రముఖ నిర్మాత కొడుకు కు ఈ అలవాటు వుందని, అతను తెల్ల వారు ఝామునే ఇంటికి చేరతాడని, అందుకోసం అతనికి ప్రత్యేకమైన ఎంట్రీ ఏర్పాటు ఇంట్లో చేసారని కూడా గుసగుసలు వినిపిస్తునాయి. కానీ అతని పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడిపోయారు.

ఆ ‘కే’ లు లేవా?

మరో పక్క ఇండస్ట్రీలో కీలకమైన రెండు ‘ కె ‘ వర్గాల పేర్లు ఎక్కడా వినిపించలేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికి  నోటీసులు అందుకున్నారంటూ వస్తున్న పేర్లేవీ దాదాపుగా ఈ రెండు కే లకు చెందినవి కాకపోవడం అన్న విషయం ఇండస్ట్రీ గుసగుసల్లో వినిపిస్తోంది. పైగా ఈ మత్తు విషయాన్ని ఓ బలమైన మీడియా మరింత బలంగా అందిస్తోంది. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇండస్ట్రీలోని కీలక వర్గాలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో దాదాపు చెట్టాపట్టాలు వేసుకున్నాయి. అందువల్ల ఆ వర్గాల జనాలు సులువుగా పక్కకు తప్పుకోగలిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బలమైన వాళ్లు తప్పించుకోగలిగారని, మిగిలిన వాళ్ల పేర్లే ప్రచారంలోకి వస్తున్నాయని, ఇండస్ట్రీ పెద్దలు ఇండస్ట్రీలోని అందరినీ సమానంగా చూడాలి తప్ప, తమ వాళ్లను కాపాడుకుని, మిగిలిన వాళ్లను గాలికి వదిలేయడం కాదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

పూరి పేరిట సంచలనం

ఇలా వుంటే పూరిజగన్నాధ్ అన్నారంటూ కొన్ని విషయాలు సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. హీరోల తండ్రి అయిన ఓ నిర్మాత పెద్ద కొడుకు అని, సినిమా రంగంపై మాంచి పట్టు వున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చిన్నకుమారుడని, అలాగే మరో నట వారసుడని, చెప్పే దమ్ము తనకు వుందని, రాసే దమ్ము మీకు వుందా అని పూరి అన్నట్లుగా ప్రచారం అవుతొంది.

ఆ ఇద్దరు అమాయకులా?

ఎవరి సంగతి ఎలా వున్నా, ఆర్ట్ డైరక్టర్ చిన్నా, సినిమాటొగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు పేర్లు రావడం ఇండస్ట్రీలో చాలా షాక్ కు గురిచేసింది. నిజంగా ఆ ఇద్దరు చాలా పద్దతయిన వాళ్లని, వాళ్లకు లింక్ వుందని అంటే ఆశ్చర్యంగా వుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాళ్లను తెలుసున్నవాళ్లు, వాళ్లతో వుండే వాళ్లు ఇదే అంటున్నారు. 
ఎక్కడో ఏదో తేడా జరిగి వుండాలి. సుగర్ పేషెంట్ అయిన చిన్నాకు స్వీట్లు అంటే ఇష్టం. అవి తప్ప, అతనికి మరో యావ వుండదు అని ఓ సినిమా మనిషి అన్నారు. శ్యామ్ కే నాయుడు చాలా పద్దతయిన మనిషి. తనేమిటో, తన పనేమిటో తప్ప వేరే వ్యవహారాలే వుండవు అని మరొకరు అన్నారు.

ఇక సుబ్బరాజు తండ్రి గోదావరి జిల్లాలో వుంటారు. ఆయన చాలా హెల్త్ కాన్షస్ నెస్ వున్న వ్యక్తి. చాలా అత్యంత సహజమైన పద్దతుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అందరికీ సలహాలు ఇస్తారు. ఎవ్వరు వెళ్లినా కాదనరని అంటారు.

మొత్తం మీద మత్తు మందుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేలాగే వుంది. వీళ్ల పేర్లు చెప్పారని, వాళ్లు, వాళ్ల పేర్లు చెప్పారని వీళ్లు కలిసి, మొత్తం పాముల పుట్ట అంతా కదిలేలా వుంది.