యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ల రాజకీయాలు?

సినిమా రంగంలో రాజకీయాలు బోలెడు వుంటాయి. ఒక సినిమా వస్తోంది అంటే, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామనుకునే వాళ్లు ఎంతమంది వుంటారో? నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్లూ అంత మంది వుంటారు. ఈ నెగిటివ్…

సినిమా రంగంలో రాజకీయాలు బోలెడు వుంటాయి. ఒక సినిమా వస్తోంది అంటే, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామనుకునే వాళ్లు ఎంతమంది వుంటారో? నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్లూ అంత మంది వుంటారు. ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్లలో చాలా మంది, విడుదలకు రెండు రోజుల ముందు కీలకంగా వ్యవహరిస్తారు.

ఎందుకంటే విడుదలకు ముందురోజే అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. బయ్యర్లు అందరూ డబ్బులు కట్టేది ఆ రోజే. ఎప్పుడైతే నెగిటివ్ టాక్ స్ఫ్రెడ్ చేయడం ప్రారంభమవుతుందో, బయ్యర్లు ఏదో సాకు, చెప్పి, ఏరియాలు పదిలక్షలు, ఇరవైలక్షలు, ఇలా ఏరియాను బట్టి యాభైలక్షల వరకు తక్కువ కడతారు. టోటల్ గా రెండు కోట్లు తేడా వచ్చేస్తుంది. ఇది మామూలుగా జరిగే తంతే.

ఇక ఈ మధ్య ఓవర్ సీస్ కొత్త రాజకీయం స్టార్ట్ అయిందని విపరీతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ మార్కెట్ ఇప్పుడైతే పుంజుకుంది కానీ, ఒకప్పుడు ఇంత లేదు. అప్పట్లో కేవలం ముగ్గురు, నలుగురు బయ్యర్లు మాత్రమే కీలకంగా వ్యవహరించేవారు. రాను రాను ఈ మార్కెట్ పెరగడంతో చాలా మంది ఈ బిజినెస్ లోకి ఎంటర్ కావడం ప్రారంభమైంది. దీనివల్ల పోటీపెరిగి రేట్లు పెరిగాయి. ఇది ఆది నుంచీ ఇదే బిజినెస్ లో వున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది.

అయితే కొత్తగా వచ్చిన వారి కన్నా, ముందు నుంచీ వున్నావారికి ఇండస్ట్రీతో, ఇండస్ట్రీ మీడియాతో సంబంధాలు ఎక్కువ. దీంతో ఎవరు కొత్తగా వచ్చి, సినిమాలు కొన్నా, ఈ పాతకాపులు విపరీతంగా గ్యాసిప్ లు స్ఫ్రెడ్ చేయించడం అన్నది ఇటీవల పెరిగిపోయినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. పైగా తమ పలుకుబడి, పరిచయాలు వాడి వీలయినంత వరకు ఆ సినిమాలు కిల్ కావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి.

ఇటీవల ఓ సంస్థ వచ్చి నాలుగైదు సినిమాలు కొంది. దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. అది వేరే సంగతి. అయితే ముందుగా ఆ సినిమాలన్నింటి మీద విడుదలకు ముందు, ఆడుతున్నపుడు విపరీతంగా నెగిటివ్ ప్రాపగండా ఓవర్ సీస్ నుంచి జరిగిందని ఆరోపణలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ తరువాత ఇప్పుడు అజ్ఞాతవాసితో మరో కొత్త సంస్థ రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ఈ పాత బయ్యర్ల దృష్టి వాళ్ల మీదకు మళ్లిందని తెలుస్తోంది. మహా అయితే రెండుసినిమాలు చేస్తారు. ఆ తరువాత వీళ్లెక్కడుంటారు? అనే కామెంట్ లు ఓవర్ సీస్ నుంచి ఇండస్ట్రీలోకి పాకుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సాయంత్రం ఓవర్ సీస్ నుంచి ఒక బయ్యర్ దాదాపు అన్ని వెబ్ సైట్లకు ఫోన్ లు చేసి దుబాయ్ టాక్ అని అజ్ఞాతవాసి గురించి వీలయినంత డిజాస్టర్ టాక్ చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని ఓ వెబ్ సైట్ ప్రచురించి, వెంటనే డిలీట్ చేసేసింది. మిగిలిన వెబ్ సైట్లు విని ఊరుకున్నట్లు తెలుస్తోంది.

సరే అజ్ఞాతవాసి హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? ఓవర్ సీస్ బయ్యర్లు గట్టెక్కుతారా?మునుగుతారా? అన్నది పక్కన పెడితే, తమ ఆధిపత్యమే కొనసాగాలని, కొత్త బయ్యర్లు రాకూడదని, వస్తే ఇలాంటివి వార్తలు స్ప్రెడ్ చేయాలని పాత బయ్యర్లు అనుకోవడం పట్ల ఇండస్ట్రీలో విమర్శలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.