అక్షరం ముక్క తెలుగు రాకపోయినా కానీ ఎందుకో సచిన్ జోషికి తెలుగు సినిమాల మీదే మోజెక్కువ. భాషతో సంబంధం లేకుండా ఎవరినైనా ఆదరించే పెద్ద మనసు మనకే ఉందని అనుకోవడం వలనో, మరే కారణం వలనో సచిన్ జోషి అదే పనిగా తెలుగు వారి మీద తన నట ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు.
బాలీవుడ్‌లోను అడపా దడపా దాడి చేసినా కానీ తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేసాడు. కోయి మిల్ గయా, ఆషికీ 2 చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేసిన సచిన్‌కి ఇంకా నట తృష్ణ తీరినట్టు లేదు. మలయాళంలో వచ్చిన ఒక స్పోర్ట్స్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తెలుగు, హిందీలో ఏకకాలంలో దీనిని రూపొందిస్తాడట.
వదల బొమ్మాళీ వదల అంటూ భట్టి విక్రమార్కుడిలా అదే పనిగా తెలుగు ప్రేక్షకులకి తన టాలెంట్ చూపిస్తోన్న సచిన్ జోషి హిట్టొచ్చే వరకు తన దండయాత్ర ఆపేట్టు లేడు. హిట్టొచ్చినా కానీ ఆపుతాడనే గ్యారెంటీ లేదు. పొరపాట్న హిట్టయితే తన సినిమాల సంఖ్య పెంచినా ఆశ్చర్యం లేదు.