సినిమా రంగంలో ఒక్కోసారి పెద్దవాళ్లంతా కలిసి చిన్న సినిమా చేయడం జరుగుతుంటుంది. గతంలో అరవింద్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లాంటి వాళ్లు కలిసి ఇలాంటి ప్రయోగాలు చేసారు. కానీ ఆ తరువాత మళ్లీ కొనసాగించలేదు.
లేటెస్ట్ గా టాలీవుడ్ లో కొందరు కలిసి ఓ సిండికేట్ లేదా ఓ ఫర్మ్ మాదిరిగా ఏర్పాటై చిన్న సినిమాలు చేయాలన్న ఆలోచన లోకి దిగారు.
అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసే నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ, నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్, నిర్మాత జెమిని కిరణ్, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ కలిసి ఓ బ్యానర్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంచి కథలు, కొత్త దర్శకులు దొరికితే చిన్న సినిమాలు చేయాలన్నది వీళ్ల ఆలోచన.
ఇప్పటికే రాజ్ తరుణ్ తో ఒకటి, శ్రీవిష్ణుతో మరొకటి చేయాలన్నది చాలా వరకు ఫైనల్ అయింది. మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. మూడు సినిమాలు హీరోలు, డైరక్టర్లు ఫైనల్ అయితే ఒకేసారి ప్రకటించాలనేది ఈ కొత్త బ్యానర్ వెనుక వున్న పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.