ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం గురించి చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రతి శీతాకాలంలోనే దాదాపు ఇదే పరిస్థితే ఉంటుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా-బంగ్లా టీట్వంటీ మ్యాచ్ విషయంలో కూడా కాలుష్యం చర్చగా నిలిచింది. టీట్వంటీ మ్యాచ్ కాసేపే జరుగుతుంది కాబట్టి ఆటగాళ్లు కూడా ఒప్పుకున్నట్టుగా ఉన్నారు.
ఇది వరకూ ఒకసారి శ్రీలంక జట్టు టెస్టు మ్యాచ్ ఆటడానికి వచ్చి ముప్పుతిప్పలు పడింది. ఆ సంగతలా ఉంటే.. ఢిల్లీలో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండటంతో.. దేశానికి రెండో రాజధాని కావాలని, అది హైదరాబాద్ అవుతుందన్నట్టుగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు.
ఆయన ఏ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ కామెంట్ మార్మోగుతూ ఉంది. ఇదంతా వ్యూహమని సోషల్ మీడియా ఎనలిస్టులు తేల్చేశారు అప్పుడే! తాము రాజకీయంగా బలపడటానికి హైదరాబాద్ ను బీజేపీ గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటోందని.. అందుకే ఢిల్లీని దేశ రెండో రాజధాని గా మార్చి, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అనుకుంటోందని ఎనలిస్టులు తేల్చేశారు.
విద్యాసాగర్ రావు ఇప్పుడు ఏ బలమైన పదవిలో కూడా లేరు. అలాంటాయన చేసే కామెంట్ కు విలువ ఎంతో అర్థం చేసుకోవడం కష్టం కాదు. అందునా ఆయనేమీ రాజకీయ సమావేశంలోనూ ఆ కామెంట్ చేయలేదు. ఏదో అలా అనేసినట్టుగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు కావాల్సినవి ఇలాంటి కామెంట్లే కాబోలు!
హైదరాబాద్ ను సెకెండ్ క్యాపిటల్ గా చేసి..దాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ అనుకోవడం ఏమిటో కానీ, వాళ్లు ఢిల్లీనే గుప్పిట్లోకి తీసుకోలేకపోతున్నారు! మోడీ ప్రదాని అయ్యాకా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కిన సీట్లు ఎన్నో అందరికీ తెలిసిందే. త్వరలోనే ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీ ముందు ఢిల్లీలో పాగా వేస్తే అదే గొప్ప సంగతిలాగుంది! తర్వాత హైదరాబాద్ సంగతి!