ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం వికటించి చివరకు రాజకీయంగా ప్రభుత్వానికి సమస్య, సవాలుగా మారిందా?
అక్రమాలను అదుపు చేసి ప్రజలకు తక్కువ ధరకు లభించే విధానం తీసుకురావాలనే ప్రయత్నం ఆచరణలో జాప్యం కావడంతో పాటు అందుకు ఊహించని విధంగా మూడు నెలల పాటు వరదలు ప్రధాన నదుల్లో కొనసాగడంతో అసలు ఇసుకే లభించని పరిస్థితి తలెత్తి మొత్తం ప్రభుత్వం ఇసుక సమస్యలో కూరుకుపోయిందా?
చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం ఓవైపు అధికారులు, మంత్రుల నిర్లిప్తిత మరోవైపు ప్రకృతి సహకరించకపోవడం కలిసి చివరకు రాజకీయ సమస్యగా మారాయి. ఈ ఇసుక తుఫాను సుడిగుండంలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా? లేక టీ కప్పులో తుఫానులాగా సద్దుమణుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారాయి.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే..
వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక వ్యాపారులుగా అవతారం ఎత్తారు. కొందరైతే మాఫియా తరహాలో అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారు. టన్ను ఇసుక వేల రూపాయల ధర పలికింది. అప్పట్లో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విక్రయాలు, ఉచితంగా ఇసుక అంటూ విధానాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు అందింది శూన్యం. ఇసుకాసురులుగా నాటి తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక విక్రయాలను పూర్తిగా నిషేదించింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, తక్కువ ధరకు లభించేలాగా నాయకులు, అధికారుల ప్రమేయం నామ మాత్రం చేసే పద్ధతిలో కొత్త విధానం అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా ఇసుక రీచ్ ల నుంచి క్రయ విక్రయాలు నిలిపివేశారు. అయితే అందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించగా అందులో జాప్యం జరగడంతో పాటు ఆ తర్వాత వరదలు రావడంతో ఇసుక లభించని పరిస్థితి నెలకొంది.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ అంటూ జాప్యం. ముందుగా సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీ అని తర్వాత అక్టోబర్కు మార్చడంతో ఇసుక రీచ్ లు ఖాళీగా ఉన్న సమయంలో పాలసీ రెడీగా లేదని తవ్వకాలకు నో చెప్పిన సర్కార్ తీరా పాలసీ రెడీ అయ్యే సరికి నదుల్లో పెరిగిన ప్రవాహాలు, వరదలు. వరదలు తగ్గుముఖం పడితే ప్రభుత్వం ఇసుక తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇసుక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే…
267 ఇసుక రీచులలో 207 రీచులు (దాదాపు 80 శాతం) భారీ వరదల కారణంగా నీటిలో మునిగి ఉన్నాయి. కేవలం 60 రీచుల నుండి మాత్రమే ఇసుక దొరుకుతోంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా భారీ వరద కొనసాగుతుంది. వాగులు, వంకలు నదులు ఉప్పొంగి 4200 TMC ల నీళ్లు సముద్రంలో కలిసాయి.గత ప్రభుత్వ హయాంలో కరువు, వానలు లేవు కాబట్టి ఇసుక ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది.
అక్రమ రవాణాపై చర్యలు ఎలా ఉన్నాయంటే…
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా వినియోగదారులకు ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఆన్ లైన్ మోసం ద్వారా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఆన్లైన్ లో బల్క్ బుకింగ్ లలో పలువురు బ్రోకర్లు వేర్వేరు అడ్రస్ లతో ఇసును బుక్ చేస్తూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా నకిలీ ఐడిలతో ఇసుకను బుకింగ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ అంచనాలను తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారని అన్నారు. అంటే మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయని ఆయన అంటున్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని, ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని ఆయన చెబుతున్నారు.