వక్కంతం వంశీకి అల్లు అర్జున్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. సొంత బ్యానర్లోనే వక్కంతం వంశీతో సినిమా చేస్తానని హామీ ఇవ్వడం కన్నా బంపర్ ఆఫర్ ఇంకేముంటుంది.? సొంత బ్యానర్లోనే ఎందుకంటే , అంతలా బన్నీకి వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చేసిందట. రచయిత వక్కంతం వంశీ, దర్శకుడిగా మారాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పాడు. కథ దగ్గరే పెట్టుకుని వంశీని వెయిటింగ్లో పెట్టేశాడు ఎన్టీఆర్.
ఎదురుచూసీ చూసీ ఇక లాభం లేదనుకుని, వక్కంతం వంశీ తన దగ్గరున్న కథల్ని పట్టుకుని హీరోల చుట్టూ తిరగడం మొదలు పెట్టడం, ఈ క్రమంలో ముందుగా అల్లు అర్జున్ దగ్గరకి వెళ్ళడం.. బన్నీకి వంశీ కథ నచ్చడం చకచకా జరిగిపోయాయి. అల్లు అర్జున్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. అది వక్కంతం వంశీకి కలిసొచ్చే అంశమే.
ప్రస్తుతం అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిజె – దువ్వాడ జగన్నాథమ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జరుగుతుండగానే, వక్కంతం వంశీ సినిమాని అల్లు అర్జున్ పట్టాలెక్కిస్తాడట. సినిమా ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దసరాకే ఈ కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయాలని ఇటు అల్లు అర్జున్, అటు వక్కంతం వంశీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాక, ఖచ్చితంగా ఎన్టీఆర్‌తో ముందు అనుకున్న సినిమాని చేస్తానని వక్కంతం వంశీ సన్నిహితులతో చెబుతున్నాడట. వంశీ ప్రిపేర్ చేసిన ఆ కథ కూడా ప్రస్తుతానికి ఎన్టీఆర్ దగ్గరే వుంది మరి.