వంగవీటీ.. ఇప్పుడీ ‘రచ్చ’ ఏంటీ.!

మొన్నీమధ్యనే 'వంగవీటి' పేరుతో ఓ సినిమా వచ్చింది. రామ్‌గోపాల్‌ వర్మ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఆణిముత్యం' లాంటి చిత్రాల్లో అదొకటి. తెలుగు నేలకు పరిచయం అక్కర్లేని పేరు 'వంగవీటి'. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో…

మొన్నీమధ్యనే 'వంగవీటి' పేరుతో ఓ సినిమా వచ్చింది. రామ్‌గోపాల్‌ వర్మ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఆణిముత్యం' లాంటి చిత్రాల్లో అదొకటి. తెలుగు నేలకు పరిచయం అక్కర్లేని పేరు 'వంగవీటి'. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 'వంగవీటి' పేరుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతల్లో ఒకరిగా దివంగత వంగవీటి రంగా గురించి చెబుతారు. ఉభయగోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా జిల్లాలోనూ ఎక్కడికక్కడ వంగవీటి విగ్రహాలు కన్పిస్తాయి. 

'వంగవీటి' పేరు వెనుక, వివాదాస్పద కోణం కూడా వుంది. అదే బెజవాడ రౌడీ రాజకీయాలు. వంగవీటి హత్యకు గురికావడం, బెజవాడ గ్రూపు తగాదాలు.. చెప్పుకుంటూ పోతే అదో పెద్ద చరిత్ర. అది రాయలసీమ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌కి ఏమాత్రం తీసిపోదు. అందుకే వర్మ 'వంగవీటి' చుట్టూ 'కథ' అల్లి సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడు. 'రక్తచరిత్ర' పేరుతో వర్మ ఏం చేశాడో చూశాం. 'వంగవీటి' సినిమా విషయంలోనూ అదే చేశాడు. 

ఇక్కడే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణకి ఒళ్ళు మండింది. ఈయనో చిత్రమైన వ్యక్తి. వున్నపళంగా భగ్గుమంటాడు.. అంతలోనే సైలెంటయిపోతాడు. రాజకీయాల్లో వున్నా, అందులో వుండాల్సిన 'నిలకడ' ఆయనలో కన్పించదు. ఇప్పుడు తీరిగ్గా 'వంగవీటి' సినిమాకి సంబంధించి రామ్‌గోపాల్‌ వర్మపై కేసు పెట్టాడు వంగవీటి రాధాకృష్ణ. 'మాకు చెప్పిందొకటి, తీసిందొకటి.. మా కుటుంబానికి రౌడీ రాజకీయాల్ని అంటగట్టాడు రామ్‌గోపాల్‌ వర్మ.. వంగవీటి రంగాని విలన్‌గా చూపించాడు..' అంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడాయన. 

సాధారణంగా ఇలాంటి సినిమా వివాదాలు ముదిరి పాకాన పడటం చాలా అరుదు. పైగా, 'వంగవీటి' సినిమాని ఎప్పుడో జనం మర్చిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసు నిలబడ్తుందా.? లేదా.? అయినా, ఇలాంటి కేసుల్ని వర్మ లెక్క చేస్తాడా.? వేచి చూడాల్సిందే.