రామ్‌గోపాల్ వర్మకీ, మెగా కాంపౌండ్‌కీ మధ్య 'రచ్చ' జరుగుతోంది గత కొన్నాళ్ళుగా. అది కాస్తా 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ వేడుక తర్వాత పీక్స్‌కి వెళ్ళింది. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో వర్మ చేస్తున్న కామెంట్లపై మెగాబ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. ఓ రేంజ్‌లో నాగబాబు, వర్మని తిట్టిపోసేశారు 'ఖైదీ' ప్రీ రిలీజ్ వేదికపైనుంచి.
ఆ వెంటనే వర్మ, సోషల్ మీడియాలో 'క్షమాపణ' చెప్పేశారు. కాస్త గ్యాప్‌లోనే, తన అకౌంట్ హ్యాక్ అయ్యిందనీ, తాను క్షమాపణ చెప్పలేదనీ వివరణ ఇచ్చుకుంటూ, నాగబాబుపై యుద్ధం షురూ చేసేశారు. ఈ వ్యవహారంపై చిరంజీవి కూడా స్పందించాల్సి వచ్చింది. 'ఖైదీ' ప్రమోషన్స్‌లో చిరు, వర్మ మీద సెటైర్లు దంచేసిన విషయం విదితమే. 'ఖైదీ' విడుదలయ్యాక, వర్మ 'అరువు తెచ్చుకున్న కథ' అంటూ మళ్ళీ ఆ సినిమాపై కౌంటర్లు వేశారు.
ఇంకోపక్క, ఇరువురి మధ్యా 'రాజీ' కుదిరిందనీ, వివాదం సద్దుమణిగిందనీ ప్రచారం జరుగుతున్న వేళ, అనూహ్యంగా చిరంజీవికి అనుకూలంగా వర్మ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడు. ఈసారి చిరంజీవిని ఆకాశానికెత్తేశాడాయన. అంతే, అంతా మళ్ళీ షాక్‌కి గురయ్యారు. ఇప్పటికైతే, వాతావరణం బాగానే వుంది. 'తూచ్, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది..' అని వర్మ బాంబు పేల్చడన్న గ్యారంటీ ఏముంది.?