పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మట్టిని తమ పొలాల్లో డంప్ చేస్తున్నారనీ, 200కి పైగా ఎకరాల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుందనీ, ఈ కారణంగా తాము తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామనీ కన్నీరు మున్నీరవుతూ బాధిత రైతులు పవన్‌కళ్యాణ్‌ని హైద్రాబాద్‌లో కలిశారు. తమ ఆవేదనను పవన్ వద్ద వెల్లగక్కుకున్నారు. మరోపక్క, రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు కొందరు, ప్రభుత్వం తమను వేధింపులకు గురిచేస్తోందంటూ పవన్‌కళ్యాణ్ వద్ద వాపోయారు.
రాజధాని వ్యవహారం పవన్‌కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు. బాధిత రైతులకు అండగా వుంటానన్నారు. అయితే, మళ్ళీ అమరావతి మొహం చూడలేదాయన. అయినా, పవన్‌కళ్యాణ్ మీద బాధిత రైతుల్లో ఎంతో కొంత నమ్మకం అయితే ఇంకా అలాగే వుండడం ఆసక్తికరం. ఇక, పోలవరం ప్రాజెక్టు బాధిత రైతుల విషయానికొస్తే.. వీరికి మాత్రం పవన్‌కళ్యాణ్ కాస్త అభయమిచ్చినట్లే కన్పించారు. 'ప్రభుత్వం ఇబ్బందులేమిటో నాకు తెలియదు, తెలుసుకుంటాను.. ప్రభుత్వం స్పందిస్తే సరే సరి, లేదంటే మీ దగ్గరకు వచ్చి, మీకు అండగా నిలబడతాను..' అంటూ భరోసా ఇచ్చారు పవన్‌కళ్యాణ్.
మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల్ని పవన్‌కళ్యాణ్ కలిసి, ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఏదో తూతూ మంత్రం ప్రకటన ఒకటి వస్తే, పవన్‌కళ్యాణ్ తొందరపడి ముఖ్యమంత్రి చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పేశారు. ఇంతకీ, బాధితుల్ని పరామర్శించిన తర్వాత, పదిహేను రోజుల్లో పార్టీ తరఫున వేసిన కమిటీ నివేదిక తెప్పించుకుని, చంద్రబాబుని కలుస్తానన్న జనసేనాధిపతి ఆ మాట మీద ఎంతవరకు నిలబడ్డారట.?
పవన్‌కళ్యాణ్ అంతే, ఆయన రూటే సెపరేటు. అసలు కిడ్నీ సమస్య ఎలా వస్తోంది? దాన్ని నివారించేదెలా? బాధితుల్ని ఆదుకోవడమెలా? అన్న అతి ముఖ్యమైన విషయాల్ని పక్కన పెట్టేసి, డయాలసిస్ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటని ఉద్దానం పర్యటనలో పవన్ ప్రశ్నించారు. బాధితులకు అందుబాటులో సత్వర వైద్య సహాయం, అవసరమైన మందులు ఇప్పించడం, దాంతోపాటుగా వారికి బస్ పాస్ సౌకర్యం వంటివి కల్పించాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేస్తే, ముందుగా డయాలసిస్ కేంద్రాల గురించే ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోంది. పవన్ అడిగిందొకటి, ప్రభుత్వం చేస్తున్నదొకటి. అయినా పవన్ హ్యాపీ.
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తాలూకు మట్టి డంపింగ్ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన కూడా కిడ్నీ బాధితుల వ్యవహారంలానే తయారయ్యేలా వుంది. రాజధాని రైతుల విషయంలోనూ పవన్ తీరు ఇంతే. తమ సమస్యల్ని జనం పవన్ వద్ద మొరపెట్టుకుంటోంటే, పవన్‌కళ్యాణ్ ప్రభుత్వ ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నారు. ఇదేం రాజకీయమో.! అందుకేనేమో పవన్‌కళ్యాణ్ వెరీ వెరీ స్పెషల్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు కూడా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని అర్థం చేసుకోలేరేమో కదా.?