సినిమా మొత్తం మళ్లీ రీషూట్ చేస్తామంటూ వర్మ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాకు తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి దర్శకుడు బాలపై వేటుపడడం ఖాయమనే విషయం తేలిపోయింది. ఇప్పుడు అందరి చూపు హీరోయిన్ పై పడింది.
అవును.. వర్మ సినిమాలో విక్రమ్ కొడుకు ధృవ్ సరసన హీరోయిన్ గా నటించిన మేఘ చౌదరిపై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. తాజా నిర్ణయంతో సినిమా మొత్తాన్ని పూర్తిగా రీషూట్ చేయబోతున్నారనే విషయం పక్కా అయింది.
మరోవైపు తన డెబ్యూ మూవీని రీషూట్ చేయబోతున్నారనే విషయం తనకు తెలియదంటోంది హీరోయిన్ మేఘ. పుట్టినరోజు వేడుకల్లో తను బిజీగా ఉన్నానని, ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదని అంటోంది. రీషూట్ లో తనను ఉంచుతారా లేక తన స్థానంలో మరో హీరోయిన్ ను పెడతారా అనే విషయంపై కూడా తనకు క్లారిటీ లేదంటోంది.
దర్శకుడు బాల తీసిన సన్నివేశాలతో సంతృప్తి చెందలేదని నిర్మాతలు ప్రకటించారు. కానీ నిర్మాతల కంటే ముందు హీరో విక్రమ్ కు ఔట్ పుట్ నచ్చలేదు. అవసరమైతే తను కొంత ఖర్చును భరిస్తానని, సినిమా మొత్తాన్ని రీషూట్ చేయాల్సిందిగా నిర్మాతల్ని విక్రమ్ కోరినట్టు తెలుస్తోంది.
ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, రీషూట్ల అనంతరం జూన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ వివాదంపై స్పందించేందుకు దర్శకుడు బాల అందుబాటులో లేడు.