Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వర్మ తెచ్చిన సెన్సారు సమస్యలు

వర్మ తెచ్చిన సెన్సారు సమస్యలు

అధికారులు రూల్స్ పాటించడం మొదలుపెడితే పనులు చేయించుకోవడం అన్నది ఎవరివల్లా కాదు. ఇండియాలో బ్యూరోక్రసీ సిస్టమ్ అలాంటిది. ప్రస్తుతం సెన్సారు వ్యవహారం ఇలాగేవుంది. సాధారణంగా సినిమాల సెన్సారుకు పదిహేను రోజులు ముందుగా దరఖాస్తు చేయాల్సి వుంటుంది.

సెన్సారు అధికారి ముందుగా అప్లయ్ చేసిన సినిమా ముందుగా చూడాలి. సినిమాలు, ప్రకటనలు, ట్రయిలర్లు ఇలా చాలా వుంటాయి. అన్నీ లైన్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం చూడాలి. పైగా సెన్సారుకు పక్కా ఫైనల్ కాపీ అందించాలి. అలా ఇచ్చిన కాపీనే నేరుగా క్యూబ్ ల ద్వారా థియేటర్లకు పంపాలి. కానీ మన జనాలు ఈ రూల్స్ ఏవీ అస్సలు పాటించరు.

అన్నింటికన్నా ముఖ్యమైనది ముందుగా దరఖాస్తు చేస్తారు కానీ, కాపీ లోడ్ చేయరు. సెన్సారు అధికారి చూస్తామని చెప్పిన ముందురోజు లోడ్ చేసేవాళ్లే ఎక్కువ. అదీకాక, ఏదో లెంగ్త్ ను సరిపెడుతూ కాపీ ఇవ్వడం తప్ప, ఫైనల్ కాపీ ఇచ్చేవారు తక్కువ. ఆర్ ఆర్ వుండదు, రఫ్ కాపీ ఇస్తారు. ఇలా చాలా వ్యవహారాలు లోపాయికారీగా జరిగిపోతూ వుంటాయి.

అన్నింటికి మించి ఆలస్యంగా దరఖాస్తు చేసి, అడ్డంలో చూడడానికి వీలుగా చిన్న సినిమాలు, ఉర్దూ సినిమాల డేట్ లు వాడేసుకుంటూ వుంటారు. వాళ్లకి తృణమో పణమో ఇస్తుంటారు. అలాగే అవసరం అయితే సెలవురోజు కూడా సెన్సారు జనాలు సినిమా చూస్తుంటారు. రోజుకు ఒకటి రెండు మించి చూడక్కరలేదు. అయినా చూస్తుంటారు.

కానీ ఇప్పుడేమయింది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పుణ్యమా అని సెన్సారు వ్యవహారాల మీద కాస్త నిఘాపడింది. ఇటీవల కేంద్రం నుంచి ఆడిట్ టీమ్ కూడా వచ్చి అన్నీ తనిఖీ చేసింది. నిబంధనలు అన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా? అన్నది చూసి వెళ్లింది. దాంతో సెన్సారు అధికారులు ఇప్పుడు పక్కా రూల్స్ మీద నిల్చున్నారు.

దాంతో ఇప్పుడు త్వరలో విడుదల కావాల్సిన సినిమాలు అన్నీ డోలాయమానంలో పడ్డాయి. 29న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం, అర్జున్ సురవరం ఈ మూడూ ఇప్పటివరకు సెన్సారు కాలేదు. అయిదున విడుదల కావాల్సిన మజిలీ కూడా లైన్లో వీటి వెనుక వుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సోమవారం, లేదా మంగళవారం చూస్తారని తెలుస్తోంది. దాని తరువాత మిగిలిన సినిమాలు. అంటే శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలు సెన్సారు అవుతాయా? అన్నది అనుమానంగానే వుంది.

రోజుకు ఒకటి రెండుమించి చూడరు. ఇప్పుడులైన్లో దాదాపు డజనున్నర సినిమాలు వున్నాయి. ఇవన్నీ చూడాలంటే కనీసం ఎనిమిది రోజులు పడుతుంది. అంటే శని, ఆదివారాలు తీసేస్తే, దాదాపు మూడు, నాలుగు తేదీలు వస్తాయి. ఈ లెక్కన ఏమాత్రం తేడా వచ్చినా మజిలీకి కూడా కష్టమే.

దాంతో సెన్సారు అధికారిని మళ్లీ బతిబాలి, బామాలి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. తనకెందుకు అనవసరపు తంటా. రూల్స్ మీద వెళ్లిపోతే సరి అని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతా ఆర్జీవీ పుణ్యం అని టాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?