ప్రతి యంగ్ హీరోకి వుండే కల ఒకటి వుంటుంది. అది బాడీని మాంచి ఫిట్ గా, కండలు తిరిగేలా చేసుకోవాలని, వీలయితే సిక్స్ ప్యాక్ చేసేయాలనీ. అయితే సిక్స్ ప్యాక్ మోజు ఈ మధ్య తగ్గింది. దానికి తోడు సిక్స్ ప్యాక్ చేసిన వారి మొహాలపై దాని ప్రభావం కనబర్చడం అన్నది కొంత విముఖత కల్గించింది.
అందుకే ఇప్పుడు కండలు పెంచడంపై దృష్టి పెడుతున్నారు. యంగ్ హీరోలు నిఖిల్, రాజ్ తరుణ్ ఇప్పటికే కండలు పెంచే పనిలో వున్నారు. నాని, శర్వానంద్ లు అటువైపు చూస్తున్న దాఖలాలు లేవు. బహుశా వాళ్ల జోనర్, వాళ్లు వేస్తున్న పాత్రలకు ఈ కండలు పెంచే పని అవసరం లేదని భావించిన వుండొచ్చు.
ఇదిలా వుంటే ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ కూడా కండల వీరుడుగా మారుతున్నారు. ఇప్పటికే బాగా కండలు పెంచేసినట్లు వరుణ్ ఈ రోజు ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటో చెప్పకనే చెబుతోంది. నిజానికి ఆరు అడుగుల పొడవు వుంటే వరుణ్ కాస్త కండ పడితే మరింత బాగానే వుంటాడన్నది వాస్తవం.
కానీ మిగిలిన మెగా హీరోల మాదిరిగా వరుణ్ ను మాస్ హీరోగా జనం అంతగా ఇష్టపడడం లేదు. క్లాస్ సినిమాలే వరుణ్ కు పేరు తీసుకువచ్చాయి. అందువల్ల కండలు పెంచడం అంత అవసరమా? అన్న కామెంట్లు కూడా వున్నాయి. మరీ సిక్స్ ప్యాక్ కాకుండా మాంచి ఫిజిక్ ఫెంచడం ద్వారా వరుణ్ మరింత అందంగా కనిపిస్తాడన్న అభిప్రాయాలు వున్నాయి. చూడాలి తరువాతి సినిమాలో వరుణ్ ఎలా కనిపిస్తాడో?