ఈ మధ్య సినిమారంగంలో ఏ అసోసియేషన్ ఎన్నిక అయినా, కాస్త హోరాహోరీగానే వుంటోంది వ్యవహారం. గత సారి మా అసోసియేషన్ ఎన్నికల పోటా పోటీగా జరిగింది. ఈసారి డైరక్టర్ల సంఘానికి అదే లెవెల్ లో ఎన్నిక జరగబోతోంది.
గతంలో డైరక్టర్ల సంఘ కమిటీపై బోలెడు ఆరోఫణలు వినవచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనది అర్హులు కాని వారికి కూడా చిత్తం వచ్చినట్లు సభ్యత్వాలు ఇచ్చేసారని. చిత్రపురి కాలనీలో ఇళ్ల కోసం, ఇతరత్రా లబ్దికోసం ఈ సభ్యత్వాలను వాడుకున్నారని వార్తలు అప్పట్లో వినవచ్చాయి.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో రెండు పానెళ్లు తలపడుతున్నాయి. దర్శకుడు ఎన్ శంకర్ పానెల్ కు సినిమా రంగంలోని పెద్ద దర్శకులు అంతా మద్దతుగా వున్నట్లు కనిపిస్తోంది.
ఈ పానెల్ లో రవికుమార్ చౌదరి, రామ్ ప్రసాద్, కాశీ విశ్వనాద్, అనిల్ రావిపూడి, అడ్డాల శ్రీకాంత్ తదితరులు వుండడం విశేషం. ఇరువర్గాలు కూడా పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారంలో హామీలే కాకుండా, పార్టీలు, ప్రలోభాలు కూడా చోటు చేసుకుంటున్నాయని వార్తలు కూడా వినవస్తున్నాయి.
ఇదిలా వుంటే ప్రచారాన్ని మరింత వేడెక్కించేందుకు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్లు అంతా రేపు సాయంత్రం యూసఫ్ గుడాలోని సవేరా ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించబోతున్నారు. రన్నింగ్ లో వున్న డైరక్టర్లు అంతా దీనికి హాజరవుతారని బోగట్టా. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది.