తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో అక్కినేని అఖిల్ ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయినట్లే. కొంచెం చిన్న చిన్న హర్డిల్స్ వున్నాయని, అవి తొలగిపోతే అనౌన్స్ మెంట్ లాంఛనంగా వస్తుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
బహుశా ఉగాదికి ప్రకటన రావచ్చు. వెంకీ అట్లూరి తొలి సినిమా తొలిప్రేమను నిర్మించిన భోగవిల్లి ప్రసాద్ నే ఈ సినిమాను కూడా నిర్మిస్తారు.
హలో సినిమా తరువాత అఖిల్ తో చాలా పేర్లు వినిపించాయి. సత్య పినిశెట్టి పేరు గట్టిగా వినిపించింది. మొన్నటికి మొన్న కొరటాల శివ పేరు వినిపించింది. చంద్రశేఖర్ యేలేటి కూడా అఖిల్ తో సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ ఆఖరికి వెంకీ అట్లూరికి లైన్ క్లియర్ అయింది.
వాస్తవానికి తొలిప్రేమ కన్నా ముందే వెంకీ అట్లూరి ఈ కథను అఖిల్ కు చెప్పి ఓకె చేయించుకున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రాజెక్టు పట్టాలెక్కడం సులువు అయింది.
అక్కినేని నాగచైతన్యతో దోచేయ్ సినిమా నిర్మించిన బోగవిల్లి ప్రసాద్ ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన అఖిల్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. అప్పుడు సుధీర్ వర్మకు రెండో సినిమా. ఇప్పుడు వెంకీ అట్లూరికి రెండో సినిమా.