నిజ జీవితంలో మామ-మేనల్లుడు విక్టరీ వెంకటేష్-హీరో నాగచైతన్య. ఇప్పుడు ఇవే క్యారెక్టర్లతో డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కథ తయారుచేసాడు. ఎప్పడో వచ్చిన సోగ్గాడు, ఆ మధ్య వచ్చిన సోగ్గాడే చిన్న నాయనా సినిమాలు పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో, నేటివ్ ఫన్ తో తయారైన సినిమాలు. శతమానంభవతి, ఫిదా కూడా ఇలాంటి లోకల్ నేటివ్ సినిమాలే. అందుకే కళ్యాణ్ కృష్ణ అలాంటి మాంచి సబ్జెక్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగచైతన్య మేనల్లుడిగా, వెంకీ మామయ్యగా కనిపిస్తారు. వీరిద్దరి మధ్య భలే ఫన్ నడుస్తుందట. దానికి తోడు పక్కా విలేజ్ కామెడీ వుండనే వుంటుంది. ఈ సినిమాకు కోనవెంకట్, దగ్గుబాటి సురేష్, మరొకరు నిర్మాతలుగా వ్యవహరిస్తారు.
అయితే చైతన్య ఎప్పుడు డేట్లు ఇస్తాడు? ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతానికి చందు మొండేటి-మైత్రీ మూవీస్ సినిమాకు డేట్ లు ఇచ్చాడు. ఆపైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ – మారుతి సినిమాకు ఇవ్వాలి. మారుతి సినిమా-కళ్యాణ్ కృష్ణ సమాంతరంగా చేసే అవకాశం వుందని వినిపిస్తోంది.