బ్రహ్మనందం తరువాత ఎవరు? ఈ ప్రశ్నకు చాలాసార్లు సమాధానం దొరికినట్లే దొరికి చేజారిపోయింది. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ఇలా అందరూ మాంచి ఛాయిస్ గా కనిపించి, అంతలోనే హీరోలుగా మారి, రెండింటికీ కాకుండా అయిపోయారు. ఇలాంటి టైమ్ లో వెన్నెల కిషోర్ అందుకున్నాడు. ఇప్పుడు వెన్నెల కిషోర్ క్రేజ్ చూస్తుంటే, కచ్చితంగా కొన్నాళ్లు ఏస్ కమెడియన్ గా తెరను ఏలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోపక్కన వెన్నెల కిషోర్ మిత్రబృందం కారణంగా అతగాడికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు వున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గూఢచారి, చిలసౌ, గీతగోవిందం తరువాత అవకాశం వున్న చోట్ల వెన్నెల కిషోర్ మిత్రబృందం కలుగ చేసుకుని, ఓ బ్లాక్ సెపరేట్ గా పెట్టమని, హైలైట్ చేయమని సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది నేరుగా కాకుండా, అప్పటికే తీసిన సీన్లలో కొన్నింటి పట్ల అభ్యంతరాలు చెబుతూ, ఇండైరెక్ట్ గా వర్క్ చేస్తున్నట్లు వినికిడి.
నిజానికి వెన్నెల కిషోర్ మాంచి కమెడియన్. అతగాడికి మంచి పాత్రలు పడితేచాలు. ఓ రేంజ్ కు చేరిపోతాడు. ఇలాంటివి అక్కరలేదు. బహుశా ఇది వెన్నెల కిషోర్ మిత్రబృందం అత్యుత్సాహం కావచ్చు. పోనీ అది కూడా ఫరవాలేదు అనుకున్నా, వెన్నెల కిషోర్ కోసం వేరే కమెడియన్ల సీన్లు తగ్గించడం కూడా తప్పే కదా?
లేటెస్ట్ గా వెన్నెల కిషోర్ మిత్రబృందం ఇలా చేసే ప్రయత్నాల్లో వుండడంతో, ముఫ్ఫైఏళ్ల అనుభవం వున్న కమెడియన్ సీన్లు ఓ సినిమాలో లేచిపోతున్నాయని తెలుస్తోంది. ఇలా అయితే డైరక్టర్లకు స్వేచ్ఛ తగ్గిపోయి, వెన్నెల కిషోర్ ను తీసుకోవడానికి ఆలోచించే ప్రమాదం వుంది.