ఓ ఫార్ములా ఫెయిల్ అయినప్పుడు మహా అయితే మరోసారి ట్రై చేస్తాం. అప్పటికీ ఫెయిల్ అయితే పూర్తిగా ఆ పద్ధతి నుంచి బయటకొచ్చేస్తాం. అయితే విజయ్ ఆంటోనీ మాత్రం మారలేదు. ఈ సాధారణ సూత్రాన్ని మరిచిపోయి, అదే రొటీన్ ప్రచారాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడు.
గతంలో తను నటించిన భేతాళుడు సినిమాకు సంబంధించి రిలీజ్ కు ముందే 9 నిమిషాల క్లిప్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు విజయ్ ఆంటోనీ. ఆ ప్రచారపు ఎత్తుగడ అందరికీ నచ్చింది కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అక్కడితో ఆగకుండా తన తర్వాతి సినిమాలు యమన్, ఇంద్రసేనకు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు. ఇక్కడ కూడా అతడికి విజయం వరించలేదు.
ఇంత అనుభవం చవిచూసిన విజయ్ ఆంటోనీ, ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీకి కూడా అదే రొటీన్ వ్యవహారాన్ని ఫాలో అవుతున్నాడు. తాజాగా కిల్లర్ అనే సినిమా చేశాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సంబంధించి కూడా ఏకంగా 2 నిమిషాల క్లిప్ విడుదల చేశాడు. త్వరలోనే మరో 5 నిమిషాల సన్నివేశం రిలీజ్ చేస్తానని ప్రకటించాడు.
ఇప్పటికే తెలుగులో వరుసగా ఫ్లాపులు తెచ్చుకుంటున్న ఈ హీరో, ఈసారి కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండేది. మళ్లీ అదే పాత పద్ధతిలో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదు. ఇప్పటికే విజయ్ ఆంటోనీ సినిమాల్ని జనం పట్టించుకోవడం మానేశారు. ఉన్నంతలో ఈ 'కిల్లర్'లో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది అర్జున్ ఎప్పీయరెన్స్ మాత్రమే.