హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. గీతగోవిందంలో ఓ పాట కూడా పాడాడు. రౌడీ బ్రాండ్ తో గార్మెంట్స్ లాంఛ్ చేశాడు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు విజయ్ దేవరకొండ. అవును.. ఈ హీరో ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు. త్వరలోనే తన సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తానంటున్నాడు.
“మా రౌడీస్ అందరం మూవీ ప్రొడక్షన్ లోకి వస్తున్నాం. చేస్తే ఏదైనా గ్రాండ్ గా చేయాలి. మినిమం 4-5 భాషల్లో రిలీజ్ కావాలి. మా ప్రొడక్షన్ లో జ్ఞానవేల్ రాజా పార్టనర్ గా చేరడం గర్వంగా ఉంది. ఇక నుంచి రౌడీస్ అంతా మన ప్రొడక్షన్ చూసి అరుపులు స్టార్ట్ చేయాలి.”
హైదరాబాద్ లో జరిగిన నోటా పబ్లిక్ మీటింగ్ లో ఇలా తన నిర్మాణ సంస్థను గ్రాండ్ గా ప్రకటించాడు దేవరకొండ. బ్యానర్ కు సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అంగీకరించిన కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత తన సొంత బ్యానర్ పై సినిమా చేయబోతున్నాడు విజయ్.
మరోవైపు నోటా సెన్సార్ సమస్యలపై కూడా స్పందించాడు విజయ్. ఇబ్బందులు లేకుండా తన సినిమా సెన్సార్ పూర్తికాదన్న దేవరకొండ, తమ సినిమా ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాసేలా ఉండదని, నోటాను ప్రోత్సహించేలా అస్సలు ఉండదని అంటున్నాడు.
“నోటా వల్ల ఎన్నికలు ప్రభావితం అవుతాయి. ప్రజలంతా నోటా బటన్ నొక్కుతారేమో, నోటా సినిమా తెలంగాణలో ఓ పార్టీకి సపోర్ట్ గా ఉంది దీన్ని ఆపేయాలంటూ కొంతమంది అఫిడవిట్లు పెట్టి కేసులు పెట్టారు. నేనేమంటానంటే దీనికి కేసుల వరకు ఎందుకు. నన్ను అడిగితే నేను చెబుతాను కదా. మేం నోటా బటన్ నొక్కమని చెప్పడం లేదు. ఒక పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఎన్నికల్ని ప్రభావితం చేసే పవర్ అయితే మన దగ్గరుంది.”
ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న నోటా సినిమాలో యంగ్ సీఎంను చూస్తారని, ఓ సరికొత్త రాజకీయాన్ని ఎంజాయ్ చేస్తారని అంటున్నాడు విజయ్ దేవరకొండ.