మొత్తంమీద ఇప్పుడు దేశం అంతటా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. వెదికి వెదికి మరీ బయోపిక్ లకు సబ్జెక్ట్ లు రెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్న విష్ణు ఇందూరి, ఇప్పుడు మరో బయోపిక్ కు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చిరపరిచితమై, ఉత్తరాదికి కూడా తెలిసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను నిర్మించేందుకు డిసైడ్ అయ్యారు.
ఈ బయోపిక్ కు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో వున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపికకు టైమ్ పడుతుంది. జయలలిత, ఎంజిఆర్, కరుణానిధి వంటి హేమా హేమీ పాత్రలు వుండే బయోపిక్. పైగా ఎన్టీఆర్ బయోపిక్ మాదిరిగా కాదు. జయలలిత జీవితంలో చాలాకోణాలు, మలుపులు వున్నాయి.
వాస్తవానికి ఓ ఇంట్రెస్టింగ్ బయోపిక్ చేయడానికి ఎన్ని అవసరమో అంతకు అంతా జయలలిత జీవితంలో వుంది. కానీ ఒకటే సమస్య. స్క్రిప్ట్ కత్తి అంచుమీద వుండి తయారుచేసుకోవాలి. ఎందుకంటే ఆమెకు తమిళనాట లక్షలాది వీరాభిమానులు వున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా చీల్చి చెండాడేస్తారు.