హీరోల అభిమానుల మధ్య కొట్లాటలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవేమీ కాదు.. ఎప్పటినుంచో వున్నవే. ఎన్టీయార్, ఏయన్నార్ కాలం నుంచే అభిమానుల మధ్య విభేదాలున్నాయి.. అవి అలా అలా కొనసాగుతూ వస్తున్నాయి. 'మేమంతా ఒక్కటే..' అని హీరోలు చెబుతూనే వున్నారు, 'మేం మాత్రం మారబోం..' అని కొందరు అభిమానులు తమ 'పైత్యం' చాటుకుంటూనే వున్నారు.
మొన్నీమధ్యన పవన్‌కళ్యాణ్ అభిమానులకీ, ఎన్టీఆర్ అభిమానులకీ మధ్య తలెత్తిన వివాదం, ఓ అభిమాని హత్యకు దారితీసింది. ఆ ఘటన పవన్‌కళ్యాణ్‌నీ, ఎన్టీఆర్‌నీ కలచివేసింది. పవన్ తన అభిమాని ప్రాణాలు కోల్పోవడంపై సీరియస్ అయ్యాడు. అభిమానులందరికీ క్లాస్ తీసుకున్నాడు.
ఇక, అసలు విషయానికొస్తే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య 'యుద్ధం' జరుగుతోంది సోషల్ మీడియాలో. దానిక్కారణం, 'నోటా' సినిమా, 'అరవింద సమేత'కు పోటీగా వస్తుండడమే. ఎన్టీఆర్‌కీ, విజయ్ దేవరకొండకీ పోటీ ఏంటి.? అనే ప్రశ్న తలెత్తడం సహజమే.
అయితే విజయ్ మార్కెట్ చాలా పెరిగిపోయింది. అతని 'ఆటిట్యూడ్'కి పెద్ద సంఖ్యలో అభిమానులు పుట్టుకొచ్చేశారు. దాంతో, 'నోటా' దెబ్బ 'అరవింద సమేత'కి గట్టిగానే తగులుతుందనేవారూ లేకపోలేదు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.
అయితే, తారక్ విషయమై విజయ్ దేవరకొండకు ఓ స్పష్టత వుంది. 'తారక్ అన్న..' అంటూ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని విజయ్ చాటుకుంటూనే వున్నాడు. అభిమానులు అలా వుండరు కదా.! అదే అసలు సమస్య. అందుకే, అభిమానుల్ని ఉద్దేశించి ఓ ట్వీటేశాడు విజయ్.
ఆ ట్వీట్‌లో, 'మనం ఎదుగుతున్నాం.. దానికి అనుగుణంగా కొన్ని రూల్స్ మనకి మనమే పెట్టుకోవాలి..' అంటూ మొదలు పెట్టాడు. 'నన్ను అభిమానిస్తున్నందుకు థ్యాంక్స్.. అలాగే ఇంకొకర్ని దూషించడం నాకు నచ్చదు.. ఆ పని మీరూ చేయొద్దు..' అంటూ తన అభిమానుల్ని 'కరెక్ట్' చేసేందుకు విజయ్ సిన్సియర్‌గానే ప్రయత్నించాడు.
మంచి సినిమాలు తన నుంచి వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చాడు. మరి, విజయ్ పిలుపుని 'రౌడీస్' (అదేనండీ విజయ్ అభిమానులు) ఎలా తీసుకుంటారో ఏమో.! ఒక్కటి మాత్రం నిజం.. అభిమానుల తీరుతో విజయ్ హర్ట్ అయినట్లే కన్పిస్తోంది. అందుకే వారిని 'కరెక్ట్' చేయడానికి ప్రయత్నించాడన్నమాట.